NZ vs NAM: సెమీస్ రేసు నుంచి నమీబియా ఔట్.. రెండో స్థానంపై కన్నేసిన కివీస్! టీమిండియాకు ఇక కష్టమే!!

షార్జా: పసికూన నమీబియాపై న్యూజీలాండ్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియా 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులకే పరిమితం అయింది. దాంతో 52 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21: రెండు ఫోర్లు), మైకెల్ వాన్ లింగెన్ (25: రెండు ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో గ్రూప్-2లో సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పాకిస్థాన్ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా.. కివీస్ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్ (4 పాయింట్లు) రెండో సెమీస్ బెర్తు కోసం ముందు వరుసలో ఉన్నాయి. కివీస్ తన ఆఖరి మ్యాచ్‌ను అఫ్గాన్‌తోనే తలపడనుంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లిపోతుంది. అప్పుడు భారత్, ఆఫ్గాన్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఈ ఓటమితో నమీబియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

రన్‌రేట్ పెరిగిపోవడంతో:
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్ మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు కెప్టెన్ ఎరాస్మస్ (3) ఔట్ కావడంతో నమీబియా కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన గ్రీన్ (23)తో కలిసి డేవిడ్ వైజ్ (16) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఛేదించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో దూకుడుగా ఆడే క్రమంలో కివీస్ బౌలర్ సౌథీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే నమీబియా ఓటమి ఖాయమైపోయింది. జేజే స్మిత్ 9, రుబెన్ 6 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2, బౌల్ట్ 2.. సాట్నర్, నీషమ్, సోధి తలో వికెట్ తీశారు.

ఓపెనర్లు విఫలం:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 163 పరుగులు చేసింది. కివీస్ జట్టును నమీబియా బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్) ఈ మ్యాచులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ డారియల్ మిచెల్(19: రెండు ఫోర్లు) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో కివీస్ డిఫెన్స్‌లో పడింది. ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28: రెండు ఫోర్లు, ఒక సిక్స్), డెవాన్ కాన్వే (17) ఆచితూచి ఆడారు. అయితే విలియమ్సన్‌ను నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కాన్వే రనౌటయ్యాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డు నెమ్మదించింది.

ఆదుకున్న ఫిలిప్స్, నీషమ్:
ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్ (39: ఒక ఫోర్, 3 సిక్సర్లు), జేమ్స్ నీషమ్ (35: ఒక ఫోర్, రెండు సిక్సర్లు) న్యూజిల్యాండ్ జట్టును ఆదుకున్నారు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తోనే.. మరోవైపు బౌండరీలు బాదారు. దాంతో నెమ్మదించిన కివీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫిలిప్స్, నీషమ్ ఇన్నింగ్స్ చివరివరకు మరో వికెట్ పడనివ్వలేదు. ఈ జోడి 60 పరుగులకు పైగా రన్స్ చేయడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా బౌలర్లు .. ఆఖర్లో పట్టు కోల్పోయారు. దాంతో కివీస్ మంచి స్కోర్ చేసింది. నమీబియా బౌలర్లలో బెమార్డ్, వైజ్, ఎరాస్మస్ తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications