కెరీర్ ఆరంభంలో కొందరు ఆటగాళ్లు ప్రయోగాలు చేస్తుంటారు. ఓపెనర్ మిడిలార్డర్‌గా, మిడిలార్డర్ ఓపెనర్‌గా.. ఇలా తమ స్థానాలు మార్చుకొని విజయవంతం అవుతుంటారు. ఆటకు దూరమై రీఎంట్రీలో మరికొందరు ఇలాంటి తరహా ప్రయోగాలే చేస్తుంటారు. జట్టులో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి సాహసాలు చేస్తుంటారు.
కానీ స్టీవ్ స్మిత్ పరిస్థితి భిన్నమైనది.లెగ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చాడు. ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. విఫలమవ్వడంతో జట్టులో చోటుకోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని సూచనలతో బ్యాటర్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. 'స్టీవ్ స్మిత్ 2.0' సూపర్ హిట్ అయ్యింది. వన్డేల్లో వన్‌డౌన్‌లో, టెస్టుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగి పరుగులు వరద పారించాడు. ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లలో ఒక్కడిగా నిలిచాడు.

కానీ 34 ఏళ్ల స్మిత్.. 'స్టీవ్ స్మిత్ 3.0'కు సిద్ధమయ్యాడు. డేవిడ్ వార్నర్ వన్డే, టెస్టులకు వీడ్కోలు పలకడంతో టెస్టుల్లో స్మిత్ ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తాడు. నాలుగో స్థానంలో జట్టుకు భరోసా ఇచ్చిన అతను ఓపెనర్‌గా విఫలమవుతున్నాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 28 సగటుతో 171 పరుగులు చేశాడు. దీనిలో వెస్టిండీస్‌పై అజేయంగా సాధించిన 91 పరుగులు మినహాయిస్తే స్మిత్ చేసింది 80 పరుగులే.
నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ 67 మ్యాచ్‌ల్లో 5966 పరుగులు చేశాడు. 61.50 సగటుతో పరుగులు సాధించాడు. 19 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు బాదాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత స్మిత్ 12, 11, 6, 91*, 31, 0, 11, 9 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌పై విమర్శలు మొదలయ్యాయి. మరో రెండు మూడేళ్లలో రిటైర్మెంట్ అయ్యే స్థితిలో ఉన్న స్మిత్‌కు ఈ ప్రయోగాలు, సాహసాలు ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కెరీర్ చరమాంకంలో కొత్తగా ట్రై చేసి ఏం సాధిస్తావని ఎద్దేవా చేస్తున్నారు. ఓపెనర్‌గా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్‌కు సూచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.