రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా క్రిస్టచర్చ్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవాళ నుంచి ఆఖరి టెస్టులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో సెంచరీ మార్క్‌ను కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథి అందుకున్నారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు.
న్యూజిలాండ్‌కు కాస్త మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు విల్ యంగ్ (14; 57 బంతుల్లో), టామ్ లాథమ్ (38; 69 బంతుల్లో) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. కానీ వికెట్ల వేటను స్టార్క్ మొదలుపెట్టాడు. విల్‌యంగ్‌ను ఔట్ తీసి కివీస్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత 100వ టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (17; 37 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. లాథమ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

కానీ హేజిల్‌వుడ్ ధాటికి మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాయి. విలియమ్సన్ కూడా ఔటయ్యే సమయానికి న్యూజిలాండ్ 84 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా పేసర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను 107/8తో పీకల్లోతు కష్టాల్లో పడేశారు. కానీ తన 'సెంచరీ టెస్టు' స్పెషల్‌లో టిమ్ సౌథి (26; 20 బంతుల్లో) బ్యాటింగ్‌తో అలరించాడు.
మ్యాట్ హెన్రీ (29; 28 బంతుల్లో)తో కలిసి సౌథి తొమ్మిదో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. కాగా, రచిన్ రవీంద్ర (4; 9 బంతుల్లో), డారిల్ మిచెల్ (4; 13 బంతుల్లో), టామ్ బ్లండెల్ (22; 31 బంతుల్లో), గ్లెప్ ఫిలిప్స్ (2; 8 బంతుల్లో) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ అయిదు వికెట్లు, స్టార్క్ మూడు, కమిన్స్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.