క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్-ఆస్ట్రేలియా టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 124/4తో ఇవాళ ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 256 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 162 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ (90; 147 బంతుల్లో) టాప్ స్కోరర్. అయితే గ్లెన్ ఫిలిప్స్ అబ్బురపరిచే ఫీల్డంగ్ విన్యాసంతో సెంచరీ దిశగా సాగుతున్న లబుషేన్ పెవిలియన్‌కు చేరాడు. సౌథి బౌలింగ్‌లో పాయింట్ దిశగా బౌండరీ సాధించాలనుకున్నాడు. కానీ అక్కడే కాచుకుని ఉన్న ఫిలిప్స్ తన కుడివైపు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌లో లబుషేన్ నిరాశగా మైదానాన్ని వీడాడు.

శనివారం ఆటను ఆసీస్ నిలకడగానే ఆరంభించింది. నైట్‌వాచ్‌మన్‌గా నిన్న క్రీజులోకి వచ్చిన నాథన్ లయాన్ (20; 27 బంతుల్లో) మరోసారి బ్యాటుతో కీలక పరుగులు చేశాడు. అయితే న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌పై ఒత్తిడిపెంచింది. సహచరులు వెనుదిరుగుతున్నా లబుషేన్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. జట్టు స్కోరు 221 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ స్టార్క్ (28; 54 బంతుల్లో), కామెరూన్ గ్రీన్ (25; 40 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (23; 22 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (21; 19 బంతుల్లో), ఉస్మాన్ ఖవాజా (16; 45 బంతుల్లో), అలెక్స్ కేరీ (14; 24 బంతుల్లో), స్టీవ్ స్మిత్ (11; 24 బంతుల్లో) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఏడు వికెట్లతో సత్తాచాటాడు.
సౌథి, బెన్ సీర్స్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టెస్టు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథికు ఎంతో స్పెషల్. తమ కెరీర్‌లో వీరిద్దరు 100వ టెస్టు ఆడుతున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.