వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆతిథ్య జట్టు కివీస్‌పై ఆసీస్ 217 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 8 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (0), లబుషేన్ (2)ను సౌథి పెవిలియన్‌కు చేర్చాడు. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (5*), నాథన్ లయాన్ (6*) ఉన్నారు.
అంతకుముందు 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 115.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌటైంది. హేజిల్‌వుడ్ (22; 62 బంతుల్లో)తో కలిసి కామెరూన్ గ్రీన్ (174*; 275 బంతుల్లో) సంచలన పోరాటంతో ఆసీస్ ఇవాళ మరో 104 పరుగులు చేసింది. గ్రీన్-హేజిల్‌వుడ్ చివరి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏ జట్టుకైనా న్యూజిలాండ్‌పై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అయిదు వికెట్లు తీశారు. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. 29 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ బ్లండెల్ (33; 43 బంతుల్లో)తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (71; 70 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని బ్లండెల్, కుగ్గెలీజ్న్ (0)ను ఒకేసారి ఔట్ చేసి కివీస్‌ను మరోసారి దెబ్బకొట్టారు. దీంతో 113 పరుగులకే ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఫిలిప్స్ టీ20 మోడ్‌లోకి వెళ్లాడు. అతడికి తోడుగా మ్యాట్ హెన్రీ (42; 34 బంతుల్లో) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్స్ 13 ఫోర్లు, హెన్రీ మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లు బాదారు. దూకుడుగా ఆడే క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయాన్ నాలుగు వికెట్లు, హేజిల్‌వుడ్ రెండు, స్టార్క్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్ (5; 13 బంతుల్లో), కేన్ విలియ్సన్ (0; 2 బంతుల్లో), రచిన్ రవీంద్ర (0; 3 బంతుల్లో), డారిల్ మిచెల్ (11; 37 బంతుల్లో), విల్ యంగ్ (9; 50 బంతుల్లో) నిరాశపరిచారు. కాగా, విలియమ్సన్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు.