వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ప్రేక్షకులందరికీ ఒక్కసారిగా భారత్ గుర్తు వచ్చింది. మూడో రోజు ఆటలో స్పిన్నర్లకు బ్యాటర్లు దాసోహమవ్వడంతో భారత్‌లోని పిచ్‌లు అందరికీ జ్ఞాపకం వచ్చాయి. మన దేశంలో పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే విషయం తెలిసిందే. అయితే సాధారణంగా న్యూజిలాండ్ పిచ్‌లు స్పిన్‌కు గొప్పగా అనుకూలించవు. పేసర్లు వికెట్ల వేటతో మజా చేసుకుంటారు. కానీ ఇవాళ ఆటలో పిచ్ అనూహ్యంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది.
తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ తన స్పిన్‌తో అయిదు వికెట్లు సాధించాడు. స్వదేశంలో గత 18 ఏళ్లలో టెస్టు ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అయిదు వికెట్లు సాధించడం ఇదే ప్రథమం. అంతేగాక కివీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా స్పిన్నర్లే వికెట్లు సాధించారు. న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోగా నాథన్ లయాన్ రెండు, ట్రావిస్ హెడ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా పేసర్లు 21 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ సాధించలేకపోవడం గమనార్హం.

కాగా, ఆదివారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. విజయానికి కివీస్ మరో 258 పరుగులు సాధించాలి. యువ సంచలనం రచిన్ రవీంద్ర (56*; 94 బంతుల్లో), డారిల్ మిచెల్ (12*; 63 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. అయితే 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ (8; 18 బంతుల్లో), కేన్ విలియమ్సన్ (9; 19 బంతుల్లో), విల్ యంగ్ (15; 52 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌తో కలిసి రచిన్ ఇన్నింగ్స్ చక్కాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 13/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. 37 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయారు. నాథన్ లయాన్ (41; 46 బంతుల్లో), కామెరూన్ గ్రీన్ (34; 80 బంతుల్లో) టాప్ స్కోరర్లు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్ అయిదు వికెట్లు, మ్యాట్ హెన్రీ మూడు, సౌథీ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 383, న్యూజిలాండ్ 179 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.