క్రిస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ గొప్పగా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలి 94 పరుగుల వెనుకంజలో నిలిచిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుంది. సీఎస్‌కే నయా ప్లేయర్ల పట్టుదల ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియాకు 279 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 134/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 108.2 ఓవర్లలో 372 పరుగులకు ఆలౌటైంది.
ఇవాళ ఆట ప్రారంభమైన కాసేపటికే న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్ (73; 168 బంతుల్లో)ను కమిన్స్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (58; 98 బంతుల్లో)తో కలిసి రచిన్ రవీంద్ర (82; 153 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సంయమనంతో ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. దీంతో లంచ్ విరామానికి కివీస్ 243/3తో పటిష్టస్థితిలో నిలిచింది.

అయితే రచిన్-మిచెల్ 123 పరుగుల భాగస్వామ్యానికి హేజిల్‌వుడ్ తెరదించాడు. అర్ధశతకం సాధించిన కాసేపటికే మిచెల్.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కేరీకి క్యాచ్ ఇచ్చాడు. అనంతరం శతకం దిశగా సాగుతున్న రచిన్‌ను కమిన్స్, టామ్ బ్లండెల్ (9; 11 బంతుల్లో)ను గ్రీన్ ఔట్ చేయడంతో స్వల్పవ్యవధిలోనే కివీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో స్కాట్ కుగెల్జిన్ (44; 49 బంతుల్లో) రాణించడంతో న్యూజిలాండ్ 372 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు, నాథన్ లయాన్ మూడు, గ్రీన్, స్టార్క్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 256 పరుగులకు ఆలౌటైంది.
కాగా, డారిల్ మిచెల్‌ను రూ. 14 కోట్లకు, రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 24 ఏళ్ల రచిన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు బాదిన అతడు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. సిరీస్ కాపాడుకోవాలంటే నిలబడాల్సిన తరుణంలో ఇవాళ రచిన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.