టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. తొలి మ్యాచ్‌లో పసికూన ఉగాండపై భారీ తేడాతో నెగ్గిన అఫ్గాన్ ఇవాళ బలమైన న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కివీస్‌కు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం. కివీస్‌తో ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభిచాడు. ఇబ్రహీం జద్రాన్ (44; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అజ్మతుల్లా (22; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/22), మ్యాట్ హెన్రీ (2/37) చెరో రెండు వికెట్లు, ఫెర్గూసన్ (1/28) ఓ వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 75 పరుగులకు కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (18; 18 బంతుల్లో, 2 ఫోర్లు), హెన్రీ (12; 17 బంతుల్లో) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. ఫజాల్లా ఫరూకీ (4/17), రషీద్ ఖాన్ (4/17) చెరో నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. మహ్మద్ నబీ (2/16) రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, ఫరూకీ అరుదైన రికార్డు సాధించారు.
టీ20 వరల్డ్ కప్‌లో బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించిన కెప్టెన్‌గా రషీద్ ఖాన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ, ఒమన్ మాజీ సారథి జీషన్ మాక్సూద్ పేరిట సంయుక్తంగా ఉంది. వెటోరీ, జీషన్ నాలుగు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. రషీద్ కూడా నాలుగు వికెట్లే సాధించినప్పటికీ 17 పరుగులే ఇచ్చాడు.
ఫరూకీ ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఉగాండపై కూడా ఫరూకీ నాలుగు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అంతేగాక రషీద్-ఫరూకీ ఉమ్మడిగా మరో ఘనత అందుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లోని ఓ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు నాలుగు వికెట్లు తీయడం ఇది మూడో సారి. అంతకుముందు ఉమర్ గుల్- షాహిద్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్‌తో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించారు.