
హైదరాబాద్: క్రికెటర్లు సుదూర విదేశీ పర్యటనలో మునిగిపోయినప్పుడు.. కుటుంబానికి సమయం కేటాయించాలని భార్యా పిల్లలతో టూర్‌లకు వచ్చేస్తుంటారు. అలా.. భారత క్రికెట్ జట్టు స్వదేశీ లేదా విదేశీ పర్యటనల్లో ఉన్న సమయంలో వారితో పాటు మనకు ఎక్కువగా కనిపించేది జరోవర్, జీవా. ఒకరు శిఖర్ ధావన్ కుమారుడు కాగా మరొకరు మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి. ఆయా పర్యటనల్లో ఈ బుడ్డి సెలబ్రిటీలు చేసే హడావుడిని క్రికెటర్లతో పాటు అభిమానులకు కూడా ఆనందంగా పంచుకుంటారు.
టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోనూ కలిసి ఆడిన శిఖర్‌ధావన్-భువనేశ్వర్ కుమార్‌లకు మంచి సాన్నిహిత్యమే ఉంది. అడపాదడపా తండ్రి ధావన్‌తో కనిపించే జరోవర్‌తో భువనేశ్వర్‌కు మంచి అనుబంధమే ఉంది. ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళ్తుంటారు. ఆటలు ఆడుకుంటూ కూడా ఉంటారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం గురించి చెప్పాడు భువి.
'ధావన్ కుమారుడు జరోవర్ సూపర్ యాక్టివ్. ఎప్పుడూ సిగ్గుపడడు. జట్టులో ఏ ఆటగాడిని చూసినా భయపడడు. అందరితో చాలా సరదాగా ఆడుకుంటాడు. ఒకసారి జరోవర్ నుపుర్(భువనేశ్వర్ భార్య)తో ఆడుకుంటున్నాడు. నేను అతడ్ని ఆటపట్టిద్దామని ఆమె నా భార్య అని కొంచెం గట్టిగా అన్నాను. ఆ తర్వాత జరోవర్ 'ఆమె నా భార్య. ఆదివారం మాత్రమే నీకు భార్య' అని అన్నాడు. ఆ మాటకు మేమంతా చాలా సేపు నవ్వుకున్నాం' అని భువి తెలిపాడు.
ప్రస్తుతం ధావన్, భువనేశ్వర్‌లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం నుంచి ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ దృశ్యాలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.