
హైదరాబాద్ : "కోహ్లీ వార్షిక ఆదాయం పది కోట్లు కావస్తుంది. మిగతా క్రికెటర్ల జీతాలు కూడా అదే స్థాయిలో పెరుగునున్నాయి. "అంటూ వచ్చిన వార్తలను నిజం కాదంటూ కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. "ఇంకా బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదని మేము చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం "అంటూ బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప‍్రస్తుతం క్రికెటర్ల వేతనాల పెంపు అంశంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు. దీనిపై త్వరలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో తుది నిర్ణయం తీసుకోనున్నామన్నారు.
ప్రస్తుతం బీసీసీఐకి వస్తున్న వార్షిక రెవెన్యూ లోనుంచి రూ. 180 కోట్లను క్రికెటర్ల వేతనాల నిమిత్తం కేటాయిస్తున్నారు. ఈ జీతాల పెంపు విషయంపై నిర్ణయం తీసుకుంటే ఇప్పడు ఇస్తున్న జీతానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. బీసీసీఐ ఒప్పుకుంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి అందరి వేతనాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు.
క్రికెటర్లకు ఇప‍్పుడు తీసుకునే వార్షిక వేతనం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన. ఇటీవల ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించిన విషయం విదితమే. దీనికి సానుకూలంగా స్పందించిన పరిపాలకుల కమిటీ ఆటగాళ్ల విన్నపాన్ని బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.