బెంగళూరు: విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌పై అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. గేల్ ఫాం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతను జట్టుకు అవసరమైన సమయంలో చెలరేగుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016లో తొలి మ్యాచ్‌లో ఒక పరుగు చేసిన గేల్.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. గత వరుస నాలుగు మ్యాచ్‌ల్లో రెండంకెల స్కోరు కూడా చేయకపోవడం గమనార్హం.
ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. 'టోర్నీలో గేల్ మళ్లీ బాగా ఆడతాడు. జట్టుకు అవసరమైనప్పుడు అతడు 100 పరుగులు కూడా చేస్తాడు. నేను గేల్ గురించి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ఇదే సమయంలో ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఇతర ఆటగాళ్లు ఆడనప్పుడు గేల్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు' అని తెలిపాడు.

గేల్ 'స్టాండౌట్ ప్లేయర్' అని కోహ్లీ పేర్కొన్నాడు. వెస్టిండీస్ తరపున టీ20ల్లో 17 సెంచరీలు సాధించాడని, ఇది మామూలు విషయమేమీ కాదని అన్నాడు. 'ఆర్సీబీకి కోహ్లీ ఆడటం గర్వకారణం. అతనో స్టాండౌట్ ప్లేయర్. ప్రతీ మ్యాచ్‌లో అతడి నుంచి అభిమానులు భారీగా ఆశిస్తున్నారు' అని తెలిపాడు.
'గేల్ రాణించకపోయినప్పటికీ తొలి మ్యాచ్‌లో 230 పరుగులు చేశాం. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో దాదాపు ప్రతీ మ్యా్ ల్లో దాదాపు 200 పరుగులు చేశాం. గేల్ ఒకవేళ విజృంభిస్తే ఏమవుతుందో ఊహించండి. గేల్, ఏబి డివిలియర్స్, నేను, వాట్సన్ ఇలాంటి అంతర్జాతీయస్తాయి ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు రాణిస్తున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లమీదే మ్యాచ్ ఆధారపడి ఉంది' అని తెలిపాడు.
108 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ ప్రదర్శన అద్భుతమని కోహ్లీ చెప్పాడు. స్పిన్నర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు.