భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20ల ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో టీమిండియానే ఫేవరేట్ అయినప్పటికీ, బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా ఉంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోకూడదని టీమిండియా భావిస్తోంది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో ఇతర జట్ల కంటే భారత్ మరింత ముందుండాలంటే బంగ్లా టెస్టు సిరీస్ విజయం తప్పనిసరి. అయితే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో భారత ఆటగాళ్లను వరల్ట్ రికార్డులు ఊరిస్తున్నాయి. 22 ఏళ్ల యశస్వీ జైస్వాల్ స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకే సాధ్యం కానీ రికార్డు ముంగిట ఉన్నాడు.

ఓ వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలవడానికి జైస్వాల్ మరో 132 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు అజింక్య రహానె పేరిట ఉంది. 2019-21 ఛాంపియ్‌షిప్‌లో రహానె 1159 చేశాడు. కాగా, డబ్ల్యూటీసీ 2023-25లో తొమ్మిది టెస్టులు ఆడిన యశస్వీ జైస్వాల్ 68.53 సగటుతో 1028 పరుగులు చేశాడు.
ఇక జైస్వాల్ మరో ఎనిమిది సిక్సర్లు కొడితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటడాడిగా నయా చరిత్ర లిఖిస్తాడు. ఈ ఏడాది జైస్వాల్ 26 సిక్సర్లు బాదాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ (33 సిక్స్‌లు, 2014) తర్వాతి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో జైస్వాల్ ఈ రికార్డు అధిగమిండచం ఖాయమే. ప్రస్తుత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఈ ఎడమచేతి వాటం కుర్రాడు రెండో స్థానంలో ఉన్నాడు.
తొలి స్థానంలో జో రూట్ ఉన్నాడు. రూట్ 16 టెస్టుల్లో 53.76 సగటుతో 1398 పరుగులు చేశాడు. జైస్వాల్ మరో 370 పరుగులు చేస్తూ రూట్‌ను అధిగమిస్తాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీలో వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకున్న భారత ఏకైక ఆటగాడు జైస్వాలే. అతని తర్వాతి స్థానంలో ఉన్న భారత బ్యాటర్ రోహిత్ శర్మ 700 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఓ డబ్ల్యూటీసీలో వెయ్యి పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్.
కాగా, ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో నాలుగు టెస్టుల ఈ క్యాలెండర్ ఇయర్‌లోనే జరగనున్నాయి. దీంతో జైస్వాల్ మరిన్ని రికార్డులు బద్దలుకొట్టడం ఖాయంగా అనిపిస్తోంది.