
హైదరాబాద్: గతంలో ఏ జట్టుకి సాధ్యం కాని విధంగా నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్‌ని నెగ్గి భారత యువ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టు వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 20 లక్షలు, ఆటగాళ్లకు రూ. 30 లక్షలు నజరానాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే బోర్డు ప్రకటించిన నగదు బహుమతిపై రాహుల్ ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నగదు బహుమతి విషయంలో ఎందుకు అసమానత పాటించారని బోర్డునే నేరుగా ప్రశ్నించాడు. తనకు ఎక్కువ ప్రకటించి... వరల్డ్ కప్ నెగ్గిన యువ జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎందుకు తక్కువ ఇచ్చారని ప్రశ్నించాడు.
'అందరూ కలిసి సమష్టిగా కష్టపడితేనే ఈ ప్రపంచకప్ దక్కింది. అంతేకానీ, నేనేమీ వారి కంటే ఎక్కువ కష్టపడలేదు. నాకంటే వారు తక్కువ కష్టపడలేదు. మన జట్టు ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి ఈ విషయం నేను చెబుతూనే ఉన్నా. అలాంటప్పుడు బీసీసీఐ నజరానా విషయంలో ఎందుకు వ్యత్యాసం చూపించిందో తెలియడం లేదు' అని ద్రవిడ్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని సొంత చేసుకున్న భారత యువ జట్టు సోమవారం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
భారత యువ జట్టు అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన వెంటనే సుప్రీం కోర్టు చేత నియమించబడిన బీసీసీఐ పాలకుల కమిటీ విజేత జట్టు సభ్యులకు రూ. 30 లక్షలు, జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ముంబైకి చేరుకున్న అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ పృథ్వీ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ వరల్డ్ కప్ గెలవడం కంటే ఈ 14-16 నెలల ప్రయాణం ఎక్కువ సంతృప్తినిస్తుందని అన్నాడు. వరల్డ్‌కప్‌ను పక్కన పెడితే అండర్-19 కుర్రాళ్లను తీర్చిదిద్దడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.
ఈ విజయానికి సెలక్టర్లు, జాతీయ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ కూడా కారణమని, జట్టు సమష్టి కృషికి ప్రతిఫలమే ఈ విజయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.