టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించడం చర్చలు సాగుతూనే ఉన్నాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మానసిక అలసట కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న ఇషాన్ కిషన్‌కు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ జట్టు కష్టాల్లో ఉన్నా ఇషాన్ రంజీ ఆడలేదు. మరోవైపు ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపికకాని శ్రేయస్ అయ్యర్‌ను కూడా రంజీట్రోఫీలో పాల్గొనమని బీసీసీఐ సూచించింది. కానీ గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రేయస్ ఆడలేదు. అయితే మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్‌ను శ్రేయస్ కలిగి ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ శ్రేయస్‌ను చిక్కుల్లో పడేసింది. దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

నొప్పి తీవ్రత అనేది వ్యక్తిగతమైనదని, ఎన్సీఏ ట్రైనర్స్ నిర్ధారించలేరని గవాస్కర్ మండిపడ్డాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందూ శ్రేయస్ రంజీ మ్యాచ్ ఆడడని, కానీ ఎన్సీఏ నివేదిక శ్రేయస్ ప్రతికూలంగా మారిందని గవాస్కర్ పేర్కొన్నాడు. ''సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే రంజీ ట్రోఫీలో ఆడలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు లిస్ట్‌లో చోటు ఇవ్వలేదు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ ఎందుకు బరిలోకి దిగలేదో ఎవరికీ తెలియదు''
''మరోవైపు రంజీ సెమీఫైనల్స్‌లో ముంబై కోసం శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. అయితే శ్రేయస్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ముందు కూడా రంజీ మ్యాచ్ ఆడాడు. టీమిండియా మేనేజ్మెంట్ సూచనల మేరకు బరిలోకి దిగాడు. దీన్ని బట్టి రంజీ ట్రోఫీలో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ నిరాకరించలేదని స్పష్టంగా ఉంది. కానీ అతడు క్వార్టర్ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో వెన్నునొప్పితో ఇంగ్లండ్ మూడో టెస్టుకు ఆడలేనని మేనేజ్మెంట్‌తో శ్రేయస్ చెప్పాడు''
''కానీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) ట్రైనర్స్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని క్లియరెన్స్ ఇచ్చారు. ఇది శ్రేయస్ అయ్యర్‌కు ప్రతికూలంగా మారినట్లుగా కనిపిస్తోంది. నొప్పి తీవ్రత అనేది వ్యక్తిగతమైంది. దీన్ని ఏ ట్రైనర్ కూడా నిర్ధారించలేడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. గత సీజన్‌లో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌కు గ్రేడ్-బి, ఇషాన్ కిషన్‌కు గ్రేడ్-సీ కాంట్రాక్టును ఇచ్చింది.