
ముంబై: టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని భర్తీ చేయాలని అనుకోవట్లేదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాజమాన్యం. ఇప్పుడున్న బౌలర్లతోనే జట్టును నడిపించాలని నిర్ణయించుకుంది. మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తూ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్‌ను కూడా పూర్తి చేయలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టాడు.
కండరాలు పట్టేయడం, చీలమండం గాయం వల్ల భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి అవసరమని టీమ్ ఫిజియోథెరఫిస్ట్ వెల్లడించారు. దీనితో మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు భువి. ఆయన స్థానంలో మరో బౌలర్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించుకోవచ్చని భావించినప్పటికీ.. బీసీసీఐ ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను జట్టులో కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి- ఆస్ట్రేలియాతో బ్యాటింగ్ సందర్భంగా గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. పిలుపు అందిన మరుక్షణమే ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు పంత్. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ ఆరంభిస్తాడని కూడా ఆశించారు. అలా జరగలేదు. మిడిలార్డర్‌లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌ను ముందుకు తీసుకొచ్చారు. అతణ్ని ఓపెనర్‌గా పంపించారు. ఓపెనర్‌గా రాహుల్ రాణించాడు కూడా.
గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను పిలిపించుకున్నట్టు- భువనేశ్వర్ కుమార్ స్థానంలో మరో బౌలర్‌ను స్టాండ్‌బైగా తీసుకోవచ్చని అనుకున్నారు. దీనికోసం మరో పేసర్ ఇషాంత్ శర్మ, స్పిన్నర్ అక్షర్ పటేల్, కొత్త ముఖం నవ్‌దీప్ షైనీ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్‌లల్లో ఎవరో ఒకర్ని ఇంగ్లండ్‌కు పిలిపించుకోవచ్చని భావించారు. ఈ జాబితాలో అందరి కంటే ముందుగా నవ్‌దీప్ షైనీ పేరు ఓ దశలో వినిపించింది కూడా. వాటన్నింటినీ పటాపంచలు చేసింది బీసీసీఐ. భువి స్థానాన్ని భర్తీ చేసే దిశగా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.