బెంగుళూరు: అంతర్జాతయీ స్థాయి క్రికెటర్లు అంటే ఖరీదైన వస్తువులను వాడుతూ ఆడంబరంగా ఉంటారని మనమంతా భావిస్తుంటాం. అయితే ఇందుకు తాను భిన్నమని టీమిండియా ఫేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా మంగళవారం చిన్నసామి స్డేడియంలో నెహ్రా మీడియాతో మాట్లాడాడు.
తాను సోషల్ మీడియాలో లేనని, తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్‌లలో ఖాతాలు కూడా లేవని చెప్పాడు. అంతేకాదు తాను ఇప్పటికీ పాత నోకియా మొబైల్ వాడుతున్నట్లు చెప్పడంతో అక్కడున్న మీడియా ఆశ్చర్యపోయింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఏం జరుగుతుందన్న వాటితో తనకు సంబంధం లేదన్నాడు.

భారత్, బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇరుజట్ల అభిమానులకు సోషల్ మీడియాలో జరుగుతున్న వైరం గురించి మీరేమంటారు అని నెహ్రాను మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగారు. అందుకు నెహ్రా స్పందిస్తూ.. మీరు ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు. ఎందుకంటే నాకు ఇంతవరకు ట్విట్టర్ కానీ ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేదని వివరించాడు.
సోషల్ మీడియాకు తాను చాలా దూరంగా ఉంటానని, ఇంకా చెప్పాలంటే న్యూస్ పేపర్స్ కూడా చదవనన్నాడు. నేనిప్పటికీ పాతతరం నోకియా ఫోన్‌నే వాడుతున్నానంటే మీరు నమ్మగలరా? నాదంతా పాతతరం ఆలోచనలనుకోండి అని బదులిచ్చాడు. అయితే బంగ్లా జట్టు మాత్రం ఈ ఫార్మాట్లో రాణిస్తుందని పేర్కొన్నాడు.
కాగా నెహ్రా వ్యవహారంపై బీసీసీఐ ట్విట్టర్‌లో స్పందించింది. సెహ్వాగ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, ఎలా గోలా మీరైనా నెహ్రాను సోషల్ మీడియాలోకి తీసుకురాగలరా అని ట్వీట్ చేసింది. దానికి వీరూ స్పందిస్తూ.. తనకు వీలైనంత వరకు ప్రయత్నిస్తానని ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చాడు.