
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. కరోనాతో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌కు ఆస్కారం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్ హజారె ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ రాశారు. రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏళ్లలో ఇదే మొదటిసారి.
రాష్ట్రాల క్రికెట్ సంఘాల కోరిక మేరకు ఈ టోర్నీకి బదులుగా విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని షా పేర్కొన్నారు. అయితే 2020-21 సీజన్‌లో విలువైన సమయాన్ని కోల్పోయామని, దాంతో ఈ ఏడాది క్రికెట్ మ్యాచ్‌ల ప్రణాళికలు రూపొందించడానికి కష్టతరమైందని వివరించారు. ఐపీఎల్-2021 సీజన్ ఆటగాళ్ల వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మహిళల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం కూడా ముఖ్యమని బీసీసీఐ సెక్రటరీ జై షా గుర్తుచేశారు. 'ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా. సీనియర్ మహిళల వన్డే క్రికెట్‌తో పాటు విజయ్ హజారె, అండర్-19 క్రికెటర్లకు వినో మన్కడ్ ట్రోఫీలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ సీజన్‌లో దేశవాళీ క్రికెట్ నిర్వహణపై మీ నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని షా పేర్కొన్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర యూనిట్లకు షా తన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నెలాఖరున ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్ హజారె ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా వచ్చే వారమే అందులోకి అడుగుపెడతారని తెలుస్తోంది.