హైదరాబాద్: ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆ జట్టుని తిరిగి గాడిలో పెట్టేందుకు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తిరిగి రావాల్సిందేనని భజ్జీ పిలుపునిచ్చాడు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో మరో రెండు వన్డేలు మిగిలుండగానే చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే భారత్ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హర్భజన్‌సింగ్ ట్విటర్ ద్వారా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం భజ్జీ మైకెల్ క్లార్క్‌ను ఉద్దేశించి కూడా ఓ ట్వీట్ చేశాడు.
'క్లార్క్ ప్రస్తుత ఆసీస్ జట్టులోకి నువ్వు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిటైర్మెంట్‌కు గుడ్‌బై చెప్పి ఆసీస్ తరఫున బరిలోకి దిగు. ఆస్ట్రేలియా నుంచి ప్రతిభ గల బ్యాట్సమెన్ల రాక తగ్గింది. ప్రస్తుత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరు' క్లార్క్‌ను ఉద్దేశించి భజ్జీ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న క్లార్క్ భారత్-ఆసీస్ మధ్య ఐదు వన్డేల సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్ భజ్జీ ట్వీట్‌పై స్పందించాడు. 'నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను ప్రస్తుతం ఏసీ కామెంటేటరీ బాక్సులో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా వర్కౌట్ చేయాల్సి ఉంది' అని క్లార్క్ ట్వీట్ చేశాడు.