
హైదరాబాద్: ఆసియా కప్‌లో భారత్ జట్టు బ్యాక్ టు బ్యాక్ వన్డేలాడినంత మాత్రానా.. ఎవరూ చావరని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 15 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగనుండగా.. భారత్ జట్టు సెప్టెంబరు 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడి ఆ తర్వాత 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
అయితే.. ఐసీసీ రూపొందించిన ఈ షెడ్యూల్‌ని ఇటీవల తప్పుబట్టిన బీసీసీఐ.. తెలివి తక్కువ షెడ్యూల్‌గా అభివర్ణించింది. పాక్‌తో కీలకమైన మ్యాచ్‌కి ముందు కనీసం ఒక్కరోజు కూడా భారత ఆటగాళ్లకి విశ్రాంతి లేకపోతే ఎలా..? అని ప్రశ్నించింది. తాజాగా ఈ వాదనపై డీన్ జోన్స్ వివాదాస్పద రీతిలో స్పందించాడు. 'మా తరంలో మేము చాలా బ్యాక్ టు బ్యాక్ వన్డే మ్యాచ్‌లాడాం. కానీ.. ఇప్పుడు ఎందుకు ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు..? ఏం వారు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడటం లేదా..? ఇంగ్లాండ్ పర్యటనలో మేము వరుసగా 11 రోజులు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు నాకింకా గుర్తున్నాయి.
ఆసియా కప్‌లో భారత్ జట్టు విరామం లేకుండా వరుసగా రెండు వన్డేలు ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నా. దానికి తోడు ఇప్పుడు ఉండే అథ్లెట్స్ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా.. అలా రెండు రోజులు వన్డేలాడటం వల్ల ఎవరూ చావరు.. బాగానే ఉంటారు' అని డీన్ జోన్స్ వెల్లడించాడు. 'ఇండియాలో వరుసగా రెండు రోజులు ఆడినా.. అప్పుడు కూడా ఏ సమస్యా రాలేదు. మరి ఇంత ఫిట్‌నెస్ ఉన్నవాళ్లకి ఏమవుతుందని భయపడుతున్నారో అర్థం కావట్లేదు' అని పేర్కొన్నాడు.
కాగా, సెప్టెంబర్ 15 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్‌లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. 'ద టోర్నమెంట్ ఆఫ్ నైబర్స్' అనే నేపథ్యమున్న వీడియోలో నైబర్ వర్సెస్ నైబర్ అంటూ సాగింది. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సీఈఓ థాకర్ మాట్లాడుతూ.. 'మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్ మంచి పోటీని నెలకొల్పనుంది. పొరుగుదేశాల మధ్య జరగనుండటంతో తీవ్రమైన ఉత్కంఠను రేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్ అన్నింటిలో ఇదే ఎక్కువ ఉల్లాసాన్ని రేకెత్తిస్తుందని హామీ ఇస్తున్నాను' అని తెలిపాడు.