న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంటు పైన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. సచిన్ క్రికెట్ నుండి రిటైర్ కావాలని ఏ ఒక్కరు కోరుకోరని కానీ అది సాధ్యపడదన్నారు. సచిన్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. సచిన్ ఎంతో ఎత్తుకు ఎదిగాడన్నారు.
క్రికెట్ పట్ల, ఆటల పట్ల యువతకు మక్కువ కలగడానికి మాస్టర్ కారణమయ్యారని అభిప్రాయపడ్డారు. సచిన్ కాలంలోనే తాను టెన్నిస్ ఆడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. రిటైర్మెంట్ ప్రకటించనున్న సచిన్‌కు తాను బెస్ట్ విషెస్ చెబుతున్నానన్నారు.

తాను మొదటి జూనియర్ వింబుల్డన్ గెలుపొందినప్పుడు సచిన్ ఇచ్చిన బహుమతి మంచి జ్ఞాపకమన్నారు. తాను పదిహేనేళ్ల వయస్సులో ఉన్నప్పుడు పసుపు పచ్చ రంగు గల పాలియో కారును సచిన్ తనకు బహుమతిగా పంపించారని, దాని పైన అతను ఆటో గ్రాఫ్ చేశారన్నారు.
గతంలో కోల్‌కతాలో సచిన్ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ ఆడినప్పుడు తాను ఎంపైర్‌గా ఉన్నానని చెప్పారు. భారత దేశంలో క్రికెట్ టాలెంట్ ఎంతో మందిలో ఉందన్నారు. అయితే ఎందరున్నా సచిన్ సచినే అన్నారు. సచిన్ చాలా ఏళ్లు దేశానికి సేవ చేశారన్నారు. కాగా, న్యూఢిల్లీలో ఆదివారం వాక్ ఫర్ హెల్త్ కార్యక్రమంలో సానియా మీర్జా, ప్రముఖ నటి సోనమ్ కపూర్ పాల్గొన్నారు.