భారత జట్టులో కొందరు రీఎంట్రీ.. టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు శాపంగా మారింది. మరో కొన్నాళ్ల పాటు సూర్యకు వన్డేల్లో ఛాన్స్ లేదని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. గంభీర్‌తో పాటు అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. టీ20ల్లో హార్దిక్ పాండ్యకు బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి గల కారణాలు వివరించారు.
ఫిట్‌నెస్ దృష్ట్యానే హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందివ్వలేదని, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించామని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. అర్హులైన వాళ్లలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నామని తెలిపాడు. ఈ ప్రక్రియలో డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలు కూడా తీసుకున్నామని అన్నాడు. ప్రపంచ టీ20 అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకరని అగార్కర్ కొనియాడాడు.

అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ వన్డే జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేదు. అవిరామంగా ఐపీఎల్, వరల్డ్ కప్ ఆడుతున్న సూర్యకు విశ్రాంతి ఇచ్చారా లేదా వన్డే ఫార్మాట్‌లో విఫలమవుతున్న కారణంతో పక్కనపెట్టారా అనే విషయం సందేహాలు ఉన్నాయి. దీని గురించి మీడియా సమావేశంలో అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.
వన్డే జట్టులో సూర్య పేరు అసలు చర్చకే రాలేదని అజిత్ అగార్కర్ తెలిపాడు. అంతేగాక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వడం వన్డేల్లో సూర్య స్థానంపై ప్రభావం చూపించిందని చెప్పాడు. ఇప్పటికి అయితే సూర్యను టీ20ల్లో మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు సూర్యకు వన్డేల్లో నో ఛాన్స్ అన్నట్లే. ఎందుకంటే ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అది ముగిసిన తర్వాత 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలో సూర్య భాగమైతే వన్డేల్లో ఛాన్స్ దక్కుతుంది. లేదంటే పొట్టి ఫార్మాట్‌కు పరిమితం కావాల్సిందే.
30 ఏళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సూర్య 33 ఏళ్లకు భారత టీ20 సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. భారత్ తరఫున 65 టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ 43 సగటుతో 167 స్ట్రైక్‌రేటుతో 2340 పరుగులు చేశాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే సూర్య వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో 35 ఇన్నింగ్స్‌ల్లో 25 సగటుతో 105 స్ట్రైక్‌రేటుతో 773 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సూర్య ప్రదర్శనపై పెద్దఎత్తున విమర్శలు సంగతి తెలిసిందే.