
ముంబై: వాంఖెడె స్టేడియం.. ముంబై చర్చ్‌గేట్ సమీపంలో, సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉండే స్టేడియం ఇది. ఐపీఎల్ 2022 టోర్నమెంట్లకు వేదిక. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముంబై, పుణెలకు మాత్రమే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు పరిమితం అయ్యాయి. ఫలితంగా- వాంఖెడె, సీసీఐ-బ్రబౌర్న్, నవీముంబైలోని డీవై పాటిల్‌తో పాటు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నడుస్తున్నాయి.
సాధారణంగా- ఐపీఎల్ మ్యాచ్‌లనగానే స్టేడియాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్లేయర్లు, ఫ్రాంఛైజీల ఓనర్లు, వారి కుటుంబ సభ్యులు, వీఐపీలతో పాటు వేలాదిమంది అభిమానులు ఒకే చోట చేరుకుంటుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీసులు భారీ గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తుంటారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తుంటారు. మ్యాచ్‌లు కొనసాగుతున్న సమయంలో గానీ, ఆ తరువాత గానీ బయటి వ్యక్తులు అంత సులువుగా స్టేడియంలోకి అడుగు పెట్టలేరు.

ఇప్పుడు ఇవే పరిణామాలు- గార్వర్ క్లబ్ సభ్యులను ఇక్కట్లకు గురి చేస్తోన్నాయి. వాంఖెడె స్టేడియం ఆవరణలో ఉండే విలాసవంతమైన క్లబ్ ఇది. చాలామంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రోజూ క్లబ్‌కు వెళ్తుంటారు. ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతుండటం, భద్రత కట్టుదిట్టం కావడం వల్ల వాళ్లు క్లబ్‌కు వెళ్లలేకపోతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ నిర్వాహక కమిటీ- వారికి ప్రత్యేక పాసులను ఇచ్చింది.
అయినప్పటికీ పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడం, పాసులు చూపించినా గానీ సవాలక్ష ప్రశ్నలను సంధించడంతో గార్వర్ క్లబ్ సభ్యులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. గార్వర్ క్లబ్ హౌస్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, బంకెట్ హాల్, టెన్నిస్ లాన్..వంటివి ఇందులో ఉన్నాయి. ఇదివరకట్లా ఏవైనా వీకెండ్ పార్టీలను నిర్వహించుకునే వెసలుబాటు కూడా ఉండట్లేదు. తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తాజాగా క్లబ్ సభ్యులు బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఘాటు లేఖ రాశారు.
మ్యాచ్‌లను ఇక్కడి నుంచి తరలించాలని సూచించారు. భవిష్యత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం వాంఖెడె స్టేడియాన్ని సెలెక్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చారు. వాంఖెడె స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువైందని క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ పురోహిత్ పేర్కొన్నారు. బంకెట్ హాల్ బుకింగ్స్ సైతం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పారు. వాంఖెడెలో నిర్వహించాల్సిన మ్యాచ్‌లను పుణేకు తరలించుకోవాలని కోరారు.