విండీస్ తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లతో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మహమ్మద్ సిరాజ్.. వన్డే సిరీస్ ఆడటం లేదు. అతనికి ఈ సిరీసులో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ లేకపోవడంతో.. వన్డే సిరీసులో కూడా భారత పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు.
అయితే అతని వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా అతనికి వన్డే సిరీసులో రెస్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. విండీస్ పర్యటన ముగియగానే టీమిండియా కీలకమైన ఆసియా కప్ ఆడుతుంది. అది ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడాలి. ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ వస్తుంది.

ఇంత బిజీ షెడ్యూల్ లో మళ్ళీ సిరాజ్ కు రెస్ట్ దొరకడం చాలా కష్టం. దానికితోడు పేసర్లకు చాలా త్వరగా గాయాలు అవుతుంటాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ.. విండీస్ వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చింది. ఈ నిర్ణయం సరైందే అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.
ఈ క్రమంలోనే విండీస్ నుంచి రిటర్న్ వచ్చే టెస్ట్ టీమ్ మెంబెర్స్ తో కలిసి సిరాజ్ కూడా ఇండియా వచ్చేశాడు. అశ్విన్, భరత్, అజింక్య రహానే, నవదీప్ సైనీ నలుగురిని కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. దీంతో వాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేశారు. వీరితోపాటు సిరాజ్ కూడా రిటర్న్ వచ్చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
ఇక జెన్యూన్ పేసర్ లేని వన్డే జట్టులో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య నేతృత్వంలో పేస్ దళం పనిచేయనుంది. అతనితోపాటు శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్.. ఈ టీంలో ఉన్నారు. వీరిలో ఉనద్కత్ ఒక్కడే సీనియర్ బౌలర్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీసులో ఉమ్రాన్ మాలిక్ ఎలా ఆడతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అతను ఈ ఏడాది అంత గొప్ప ఫామ్ లో లేని సంగతి తెలిసిందే.