
హైదరాబాద్: ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా లేని సంగతి తెలిసిందే. అయితే, సమీప భవిష్యత్తులో భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి అంపైర్ ఒక్కరైనా వస్తారని అనుకోవడం లేదని మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ అభిప్రాయపడ్డారు.
ఒక ప్రపంచ స్థాయి అంఫైర్‌ను సృష్టించడానికి భారత్‌కు ఒక దశాబ్దం పడుతుందని చెప్పుకొచ్చారు. 2015లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఎస్ రవిని ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన జాబితా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. యాషెస్‌తో సహా 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20లకు రవి అంపైర్‌గా వ్యవహారించారు.
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సైమన్ టౌఫెల్ మాట్లాడుతూ "ప్రపంచ స్థాయి అంపైర్ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించినట్టు నాకు గుర్తు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లోకి ఎస్ రవి అడుగుపెట్టేందుకు కనీసం పదేళ్లు పట్టింది" అని అన్నారు.
"అందుకే బీసీసీఐ ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు జరుగుతోందని అనుకోవడం లేదు. భారత్‌కు అంపైర్లు కావాలి. సౌరవ్ గంగూలీ (కొత్త బిసీసీఐ బాస్) దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయడం గురించి మాట్లాడే సందర్భంలో అంఫైరింగ్ ప్రోగ్రామ్‌ని కూడా దృష్టిసారించాలి" అని తెలిపారు.
"ఇది అంపైర్ల గురించి మాత్రమే కాదు. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్స్ మేనేజర్, అంపైర్స్ కోచ్, అంపైర్స్ ట్రైనర్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలి. అందరూ సురక్షితంగా ఉండే, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థను సృష్టించాలి" అని ఆస్ట్రేలియాకు చెందిన 48 ఏళ్ల సైమన్ టౌఫెల్ చెప్పుకొచ్చారు.
2012లో అంఫైరింగ్‌కు వీడ్కోలు పలికిన సైమన్ టౌఫెల్ అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ ఫెర్పామెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా కొనసాగారు. ఎస్ వెంకటరాఘవన్ తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంఫైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న రెండో అంఫైర్‌గా ఎస్ రవి అరుదైన ఘనత సాధించాడు.