'సర్రే'కు సైన్ చేసిన కోహ్లీ: అందుకుంటున్న మొత్తం ఎంతో తెలుసా?

హైదరాబాద్: భారత్ తరుపున అత్యధిక వేతనం సంపాదిస్తున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇటీవలే ఫోర్బ్స్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్-5లో నిలిచాడు. యస్ అంటే చాలు... కోహ్లీతో ఒప్పందం చేసుకునేందుకు ఎన్నో బ్రాండ్‌లు క్యూలో ఉన్నాయి. ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తాజాగా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు గాను కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సర్రే జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరుపున విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడనున్నాడు.

కోహ్లీతో కాంట్రాక్ట్ అనగానే పెద్దమొత్తం
కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్‌తో కాంట్రాక్ట్ అనగానే పెద్ద మొత్తంలో ఉంటుందని అంతా ఊహిస్తారు. అయితే సర్రే జట్టుతో చేసుకున్న ఒప్పందంలో అందుకు భిన్నంగా ఉంది. విరాట్ కోహ్లీకి రానుపోను విమాన టికెట్ ఖర్చులు, అక్కడ వసతి, నామమాత్రపు మ్యాచ్ ఫీజు మాత్రమే సర్రే జట్టు చెల్లిస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇంగ్లాండ్ పరిస్థితులు అలవాటు పడేందుకే
కేవలం ఇంగ్లాండ్ స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకే ముందుగా కోహ్లీ అక్కడికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. డబ్బుపై కాకుండా కేవలం నాణ్యమైన ప్రాక్టీస్ దొరికితే చాలని కోహ్లీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికోసం సొంతగడ్డపై ఆఫ్ఘన్‌తో జరగబోయే ఏకైక టెస్టుతోపాటు ఐర్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా కోహ్లీ దూరమవుతున్నాడు.

ప్రాక్టీస్ కావాలన్నది అసలు లక్ష్యం
కోహ్లీకైనా, బోర్డుకైనా డబ్బు ముఖ్యం కాదని, ప్రాక్టీస్ కావాలన్నది లక్ష్యం కావడంతో దీనికి అంగీకరించినట్లు బోర్డు అధికారి పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తం ఇస్తున్నారన్నది మాత్రం బయటకు వెల్లడించే విషయం కాదని ఆయన అంగీకరించలేదు. కౌంటీల్లో ఆడే సాధారణ ప్లేయర్‌కు ఇచ్చేంత మాత్రమే కోహ్లీకి కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

కోహ్లీ ఇమేజిని వాడుకునేందుకు నో చెప్పిన బీసీసీఐ
కోహ్లీ ఇమేజ్‌ను వాడుకోవడానికి సర్రే జట్టు చూసినప్పటికీ, దానికి బీసీసీఐ నో చెప్పింది. అతడు కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. ఆ సమయంలో మిగతా కార్యక్రమాలు ఉంటే క్రికెట్‌పై ఏకాగ్రత కుదరదన్న ఉద్దేశంతో బోర్డు దానికి అంగీకరించలేదు. జూన్ 1న కెంట్‌తో జరిగే వన్డే మ్యాచ్‌తో కోహ్లీ సర్రే జట్టుతో చేరతాడు. మూడు వన్డేల తర్వాత మరో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు కూడా కోహ్లీ ఆడనున్నాడు. జూన్ 28తో విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications