ముంబై: ఇక తమ అభిమాన ఆటగాళ్ల నుంచి ఆటోగ్రాఫ్‌లను పొందడం కష్టమే. మైదానంలో ఆడుతున్న సమయంలో బౌండరీ వద్ద ఆటగాళ్ల నుంచి వారి ఆటోగ్రాఫ్‌లను తీసుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మాత్రం అది కుదరదు. ఎందుకంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ).. ఆట మధ్యలో ఆటగాళ్లు ఎవరూ ఇతరులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఛాంపియన్స్ లీగ్ టి20, భారత్‌లో బిసిసిఐ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. మైదానంలో ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం వల్ల ఆటగాళ్లు తమ ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉందని చెప్పింది.

అంతేగాక, ఆటోగ్రాఫ్ పేరుతో బుకీలు కీలక సమాచారాన్ని ఆటగాళ్లతో పంచుకునే అవకాశం ఉందని బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం అనుమానిస్తోంది.
ఆటోగ్రాఫుల వ్యవహారాన్ని కట్టడి చేయడం కష్టమే అయినా, క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా ప్రపంచ వ్యాప్త నిషేధానికి ప్రయత్నిస్తున్నామని బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెఎస్ మాధవన్ తెలిపారు. ఇది ఇలా ఉండగా తమ అభిమానుల నుంచి ఆటోగ్రాఫ్ తీసుకునే అవకాశాన్ని బిసిసిఐ చర్యతో కోల్పోతున్నామని పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.