హైదరాబాద్: హాసన్ అలీ.... ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్లో ఓ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో హాసన్ అలీ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హాసన్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్‌వన్‌గా నిలవాలన్నది తన చిన్ననాటి కల అని తెలిపాడు.
'అంతర్జాతీయ క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఎదగాలన్నది నా చిన్ననాటి కల. ఇప్పుడు అది నెరవేరింది. నా లక్ష్యాలను నేను చిన్నతనంలోనే నిర్దేశించుకున్నాను. సోదరుడు రెహ్మాన్ నాలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఇప్పుడు నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం 2019 వరల్డ్ కప్ నెగ్గడం. ఆ దిశగానే ప్రాక్టీస్ చేస్తున్నా' అని అలీ తెలిపాడు.
2016 ఆగస్టులో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హాసన్ అలీ కేవలం 14 నెలల్లోనే నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకోవడం విశేషం. పాకిస్థాన్ తరుపున ఇప్పటి వరకు 25 వన్డేలాడిన హాసన్ అలీ 54 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో హాసన్ అలీ ఓ అరుదైన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ డెన్నిస్ లిల్లీతో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. 23 వన్డేల్లో హాసన్ అలీ 50 వికెట్లు తీయడం విశేషం.
ఈ ఏడాది ఇప్పటి వరకు తాను ఆడిన 17 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇక యుఏఈ వేదికగా ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను ఇప్పటికే పాకిస్థాన్ 4-0తో సొంతం చేసుకుంది. అలీ ఆడిన నాలుగు మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. అబుదాబిలో జరిగిన మూడో వన్డేలో అలీ 5 వికెట్లు తీశాడు.