ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL)2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో బౌలర్ దిగ్వేష్ రాఠీతో మైదానంలో జరిగిన వాగ్వాదంపై బ్యాటర్ నితీష్ రాణా తన మౌనాన్ని వీడాడు. దిగ్వేష్ రాఠీయే ఈ వివాదాన్ని మొదలుపెట్టాడని నితీష్ రాణా ఆరోపించాడు. ఒక సిక్సర్ కొట్టిన తర్వాత దిగ్వేష్ రాఠీ స్టైల్‌లో నితీష్ రాణా బ్యాట్‌తో సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నితీష్ రాణా 55 బంతుల్లో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో నితీష్ రాణా మాట్లాడారు.
నితీష్ రాణా వివరణ
"తప్పు ఎవరిది అనేది ముఖ్యం కాదు. అతను తన జట్టు కోసం గెలవడానికి వచ్చాడు, నేను నా జట్టు కోసం గెలవడానికి వచ్చాను," అని రాణా అన్నాడు. "కానీ క్రికెట్ ఆటను గౌరవించడం నా బాధ్యత, అతని బాధ్యత కూడా. ఈ గొడవను మొదలుపెట్టింది అతనే.ఏం జరిగిందో నేను వివరంగా చెప్పను, అది సరికాదు. కానీ ఎవరైనా నన్ను రెచ్చగొడితే, నేను ఊరికే ఉండను. నేను మొదటి నుంచి ఇలాగే క్రికెట్ ఆడాను. ఎవరైనా నన్ను రెచ్చగొట్టి, దానివల్ల నన్ను అవుట్ చేయగలమని అనుకుంటే, నేను కూడా సిక్సర్లతోనే సమాధానం ఇస్తాను. నిన్న జరిగింది దానికి ఒక ఉదాహరణ" అని రాణా వివరించాడు.

రాఠీతో గొడవను తను మొదలుపెట్టలేదని నితీష్ రాణా స్పష్టం చేశాడు. "గొడవను ఎవరు మొదలుపెడతారో, దానిని ముగించడం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు చాలా గొడవల్లో ఉన్నాను. కానీ ఇప్పటివరకు ఏ గొడవను నేను మొదలుపెట్టలేదు. ఎవరైనా నన్ను ముందుగా ఏదైనా అంటే, నేను కచ్చితంగా బదులిస్తాను. అదే నా పద్ధతి" అని నితీష్ రాణా అన్నారు.
"నా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదు, నీకు నువ్వుగా నిలబడాలి అని వారు నాకు నేర్పించారు. నేను అదే చేస్తాను, భవిష్యత్తులో కూడా అదే చేస్తాను" అని ఆయన అన్నారు. నితీష్ రాణా సారథ్యంలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఆదివారం డీపీఎల్ 2025 ఫైనల్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో తలపడనుంది.
నితీష్ రాణా-దిగ్వేష్ రాఠీలకు జరిమానా
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో వాగ్వాదం తర్వాత నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలకు భారీ జరిమానా విధించారు. శుక్రవారం ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలు ఇద్దరూ మైదానంలో గొడవ పడడం, ఒకరికొకరు సైగలు చేసుకోవడం వల్ల వారిపై జరిమానా విధించారు. మ్యాచ్ అనంతరం డీపీఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. నితీష్ రాణాతో గొడవ కారణంగా దిగ్వేష్ రాఠీకి 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. అదే విధంగా.. నితీష్ రాణాకు ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.