
కోల్‌కతా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా మరోసారి భారత్ తరఫున బరిలోకి దిగాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇండియాటుడేతో ప్రత్యేకంగా ఈ విషయమై రానా మాట్లాడాడు. తాను జాతీయజట్టులోకి తిరిగి రావాలనుకుంటున్నానని, అదే తన కల అని పేర్కొన్నాడు. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో 2021లో శ్రీలంకపై రానా అరంగేట్రం చేశాడు. అతను రెండు టీ20లు, ఒక వన్డే ఆడాడు. ఆ పర్యటనలో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అతనికి మళ్లీ జట్టులో చోటు దక్కలేదు. అయినప్పటికీ తాను గివప్ ఇచ్చేది లేదని, మళ్లీ జట్టులో చోటు సంపాదించడానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పాడు. అందుకు తగ్గట్లు ఆలోచనలు జరుపుతున్నట్లు తెలిపాడు.
'క్రికెటర్‌గా నేను మరో అవకాశం కోసం నేను చూస్తున్నాను. నేను బాగా ఆడలేదు కాబట్టి నేను జట్టులో చోటు కోల్పోయాను. ఆ విషయంలో నేను ఎటువంటి సాకులు చెప్పదలచుకోలేదు. సెలెక్టర్లు నన్ను విస్మరించకుండా ఉండేందుకు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి 500కు పైగా పరుగులు చేయాలని అనుకుంటున్నాను. నా కంట్రోల్‌లో ఉంది ఒకటే. అత్యుత్తమ ప్రదర్శన చేయడం. తగినన్ని పరుగులు చేయడం. అందువల్ల నేను నా బ్యాటింగ్లో రాణించడానికి, మెరుగుపడటానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చే సీజన్‌లో మరిన్ని పరుగులు చేయాలని ఆశిస్తున్నాను. నేను ఎక్కడ ఆడినా నా వరకు 100పర్సెంట్ ఇస్తాను.' అని చెప్పాడు. ప్రస్తుతం సెలెక్టర్లు తనను ఎంపిక చేయకుంటే తన పనితీరును మరింత పెంచుకోవాల్సి వస్తుందని, తన భవిష్యత్తు తన చేతుల్లోనే ఉందని రానా తెలిపాడు.
కుడిచేతి బ్యాటర్లే ప్రస్తుతం టీమిండియా జట్టులో ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల నిఖార్సైన లెఫ్టాండర్ కోసం జట్టు చూస్తుంది. లెఫ్టాండర్ మరియు మిడిలార్డర్ అయిన నితీష్ రాణాకు భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు అవకాశాలున్నాయి. పంత్ మినహా ప్రస్తుతం ఇండియా టీం బ్యాటింగ్ లైనప్‌లో లెఫ్టాండర్లు కరవయ్యారు. జడేజా, అక్షర్ పటేల్ వంటి వారు ఆల్రౌండర్లే కానీ.. వాళ్లు టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు కారు. వచ్చే ఐపీల్లో సత్తా చాటితే రానాకు అవకాశాలు వచ్చే వీలుంది. ఏదేమైనా రానా పాజిటివి పట్ల మెచ్చుకోవాలి. అతను తిరిగి టీమిండియాకు ఆడాలని కోరుకుందాం.