టీమిండియా యువ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. స్టేడియంలో తన మెరుపు బ్యాటింగ్, పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించే ఈ ఆంధ్ర కుర్రాడు.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుని వార్తల్లో నిలిచాడు. ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు, కెరీర్, తన జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి నితీష్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మనసులోని మాటను బయటపెట్టిన నితీష్!
పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఒకవేళ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవాల్సి వస్తే ఆమెకు ఉండాల్సిన లక్షణాలను వివరించాడు. తన వృత్తి అయిన క్రికెట్ పట్ల ఆమెకు కనీస అవగాహన ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. క్రికెటర్ల జీవితంలో ఉండే ఒడిదుడుకులు, ఒత్తిడిని అర్థం చేసుకుని, కష్టసుఖాల్లో తోడుగా ఉండే మనస్తత్వం ఉన్న అమ్మాయి అయితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. నితీష్ కుమార్ రెడ్డి తన కాబోయే భార్య ఉండాల్సిన ఎత్తు గురించి చెప్పాడు. "నాకు కొంచెం ఎత్తు ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. సుమారు 5'7" నుంచి 5'8" వరకు ఎత్తు ఉంటే నా పక్కన చూడటానికి జోడీ బాగుంటుంది" అని నితీష్ కుమార్ రెడ్డి నవ్వుతూ చెప్పాడు. సాధారణంగా క్రికెటర్లు తమ ఫిట్‌నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. నితీష్ తన భాగస్వామి విషయంలో కూడా అంతటి స్పష్టతతో ఉండటం విశేషం.
నితీష్ తన అభిప్రాయాన్ని మరింత సరదాగా వివరిస్తూ.. తనకు ఎత్తు ఉన్న అమ్మాయిలే ఎందుకు ఇష్టమో కూడా చెప్పాడు. "ఆమె సహజంగానే ఎత్తుగా ఉంటే, మళ్లీ ప్రత్యేకంగా హై-హీల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ ఒక్క క్వాలిటీ ఉన్నా నాకు సరిపోతుంది" అని చమత్కరించాడు. నితీష్ చేసిన ఈ సరదా కామెంట్లు నెటిజన్లను, ముఖ్యంగా మహిళా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్ ఆరంభంలోనే ఆటపై ఎంతటి ఏకాగ్రతతో ఉన్నాడో, వ్యక్తిగత విషయాల్లోనూ అంతే క్లారిటీతో ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.