హైదరాబాద్: గత కొన్ని నెలలుగా తాము ధరిస్తున్న జెర్సీల నాసిరకంగా ఉన్నాయని, కిట్లను పంపిణీ చేసే అఫీసియల్ కిట్ స్పాన్సర్ నైకీపై కెప్టెన్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కిట్ల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను జట్టులోని ఆటగాళ్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లగా... బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని బోర్డు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో నైకీ వెంటనే దిగొచ్చింది.

టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో నైకీ ఉన్నతాధికారుల బృందం మాట్లాడింది. ఈ ఫిర్యాదు గురించి తెలిసుకున్న నైకీ నలుగురు సంస్థ ఉన్నతాధికారులతో బెంగళూరు నుంచి హుటాహుటీన కొత్త కిట్లు పంపించింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లు నైకీ అందించిన కొత్త కిట్లతోనే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడం విశేషం.
ధోనీ, రోహిత్, రహానె, కేదార్ జాదవ్ మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్ కొత్త కిట్లతో ప్రాక్టీస్ చేశారు. ధోనీ, రోహిత్ శర్మలు కొత్త కిట్లను పరిశీలించి, తమ అభిప్రాయాలు వివరించారు. కొత్త కిట్లపై ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అధికారికంగా అందుబాటులోకి తీసుకువస్తామని నైక్ సిబ్బంది తెలిపారు.

అంతేకాదు కొత్త కిట్లను భారత జట్టు ఆటగాళ్లు శ్రీలంకలో ప్రస్తుతం జరుగుుతన్న వన్డే సిరీస్‌తో పాటు స్వదేశంలో సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల సిరిస్‌లో ఉపయోగిస్తారని నైకీ సిబ్బంది వెల్లడించింది. మరోవైపు కిట్లు నాసిరకంగా ఉన్నాయని ఆటగాళ్లు చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నైకీ సిబ్బంది నిరాకరించారు.
కాగా, 2006 నుంచి నైకీ సంస్థ టీమిండియాకు జెర్సీలు, షూస్‌ను సరఫరా చేస్తోంది. ఇన్నేళ్లలో ఆ సంస్థపై లేని ఫిర్యాదులు తాజాగా శ్రీలంక సిరిస్‌లో ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. 2020 సెప్టెంబర్ వరకు టీమిండియాతో నైకీకి బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది నైకీ బీసీసీఐకి 370 కోట్ల రూపాయలు చెల్లించింది. తమ బ్రాండ్ ఉత్పత్తులను ధరిస్తున్నందుకు ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు 87 లక్షల 34 వేల రూపాయలను నైకీ చెల్లిస్తోంది.