
ధోనీని తప్పించి యువ క్రికెటర్లకు అవకాశం
వీరి స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చి, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. 52 రోజులు సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా పర్యటనలో సీనియర్ క్రికెటర్లు పూర్తిగా అలసిపోయారు. దీంతో ఏప్రిల్‌లో ఐపీఎల్ 11వ సీజన్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చామని సెలక్టర్లు చెప్పారు. అయితే ఈ విశ్రాంతి జాబితాలో మాజీ కెప్టెన్ ధోని పేరు ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు.

సఫారీ గడ్డపై ఆరు వన్డేలు, మూడు టీ20లు
సఫారీ గడ్డపై ధోని ఆరు వన్డేలు, మూడు టీ20లు మాత్రమే ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌ల్లో అన్ని ఇన్నింగ్స్‌ల్లో ధోని బరిలోకి దిగిందీ లేదు. మరోవైపు సఫారీ గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను ఎందుకు ఎంపిక చేశారు? అని ధోని అభిమానుల్ని వేధిస్తోన్న ప్రశ్న. 'ధోనీనే తనకి విశ్రాంతి కావాలని కోరాడు' ఇది జట్టుని ప్రకటించిన అనంతరం సెలక్టర్లు చెప్పిన మాట. గతేడాది ఇదే తరహాలో స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకి రెస్ట్ కావాలంటే ఇచ్చామని చెప్పి వన్డే, టీ20 జట్టు నుంచి తప్పించారు.

అశ్విన్, జడేజాలకు ఏమైందో చూశారా?
ఆ తర్వాత వారిద్దరూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి పునరాగమనం చేయలేకపోయారు. తాజాగా ముక్కోణపు సిరిస్‌కు ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లని జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో వీరిద్దరిలో ఎవరైనా మెరుగ్గా రాణిస్తే 2019 వరల్డ్ కప్‌కు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఉపయోగపడతాడనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారేమో!

ఇటీవల కాలంలో టీ20ల్లో అంతగా రాణించని ధోని
ఇటీవల కాలంలో ధోని టీ20 క్రికెట్‌లో అంతగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ధోనీని టీ20ల నుంచి తప్పించి అతడి స్థానంలో సెలక్టర్లు మరో వికెట్ కీపర్ వేటలో పడ్డారన్న వాదనలకి తాజా సెలక్షన్ కూడా బలం చేకూరుస్తోంది. గతేడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోనినే తప్పుకున్నట్లు చెప్పారు. అయితే 2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రత్యేకంగా ధోనితో మాట్లాడి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో ధోనిని ఒప్పించారా..? అనే సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కోసమే ధోనీ విశ్రాంతి
మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ధోని విశ్రాంతిని కోరుకుని ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుపటి ఫామ్‌ని అందుకునేందుకు ధోనినే విశ్రాంతి కోరుకున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారత్-బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 6 నుంచి 18 వరకు ముక్కోణపు టోర్నీ జరగనుండగా.. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకానుంది.


Click it and Unblock the Notifications













