
హైదరాబాద్: లంక వేదికగా తలపడనున్న భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ట్రై సిరీస్ జరగనుంది. మార్చి 6 నుంచి జరగనున్న ఈ సిరీస్ గెలిచేందుకు టీమిండియా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో టీ20 ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా నెట్స్‌లో కఠోర సాధన చేస్తుంది.
ముఖ్యంగా ప్రస్తుత సిరీస్‌లో పాల్గొనే జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లే. లంక పర్యటనకు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ గడ్డపై సత్తాచాటి సెలక్టర్ల దృష్టిలో పడాలని కుర్రాళ్లు భావిస్తున్నారు.
తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్ మాత్రమే అనుభవజ్ఞులు. ఆతిథ్య లంకతో తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను గొప్పగా ఆరంభించాలని భారత్ ఆశిస్తోంది.
యువ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిని త్రో వేయడంపై ఎక్కువ దృష్టి సారించారు. మైదానంలో చురుగ్గా కదలడానికి ముందస్తుగా భారత కోచ్‌లు వినూత్నంగా సాధన చేయించారు . టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాన్ని బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.