ఓడిపోతుందనుకున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది టీమిండియా. ఇంగ్లాండ్ పర్యటనను ఘన విజయంతో విజయంతో ముగించింది. అయిదు టెస్ట్ మ్యాచ్ ల అండర్సన్- టెండుల్కర్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. తిరుగులేదని నిరూపించుకుంది.
చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ స్కోర్ ను అందుకోవడంతో ఇంగ్లాండ్ విఫలమైంది. 367 పరుగుల వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగారు. వికెట్లను పంచుకున్నారు. సిరాజ్ అయిదు వికెట్లతో నేలకూల్చాడు. ప్రసిద్ధ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఓ వికెట్ తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కేప్టెన్ శుభ్ మన్ గిల్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు కొట్టాడీ బ్యాటర్.
ఈ సిరీస్ మొత్తానికీ అదరగొట్టాడు సిరాజ్. అయిదు టెస్ట్ మ్యాచ్ లల్లో 23 వికెట్లు పడగొట్టాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ సిరీస్ తో అతని దశ పూర్తిగా తిరిగిపోయింది. జస్ ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. బౌలింగ్ డిపార్ట్ మెంట్ కు బ్యాక్ బోన్ గా మారగలిగాడు.
ఇంగ్లాండ్ లెజెండరీ ప్లేయర్లను సైతం ఆకట్టుకున్నాడు సిరాజ్. నాజిర్ హుస్సేన్.. వంటి మాజీలు అతన్ని ఆకాశానికెత్తేస్తోన్నారు. టీమిండియాకు అసలు సిసలు టెస్ట్ పేస్ బౌలర్ దొరికాడని, ఎక్కువ సేపు బంతులను సంధించగల సామర్థ్యం అతనికి ఉందని చెబుతున్నారు. ప్రతి బంతిలోనూ వైవిధ్యం చూపించగలడని ప్రశంసిస్తోన్నారు.
డెయిలీ మెయిల్ లో రాసిన ఓ కాలమ్ లో నాజిర్ హుస్సేన్.. మహ్మద్ సిరాజ్ ప్రస్తావన తెచ్చాడు. సిరాజ్‌కు బెన్ స్టోక్స్ సహా తోటి ఇంగ్లాండ్ క్రికెటర్లు ఓ నిక్ నేమ్ పెట్టారని వెల్లడించాడు. 'మిస్టర్ యాంగ్రీ' అని పిలుస్తారని తెలిపాడు. మ్యాచ్ ఆడేటప్పుడు ఎనర్జిటిక్, ఫుల్ ఫైర్ తో సిరాజ్ కనిపిస్తాడని, అందుకే అతనికి ఆ పేరు పెట్టారని చెప్పాడు.
తాను సిరాజ్ ను బోర్న్ ఎంటర్టైనర్గా భావిస్తానని నాజిర్ హుస్సేన్ చెప్పాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎంతో శ్రమించి ఉండొచ్చని, క్రికెట్ పట్ల అతనికి ఉన్న ప్యాషన్ ఈ స్థాయికి చేర్చిందని వ్యాఖ్యానించాడు. లార్డ్స్ టెస్ట్ లో అవుట్ అయినప్పుడు నిరాశతో మోకాళ్లపై కూర్చున్న సిరాజ్.. ఓవల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ను మోకరిల్లేలా చేశాడని పేర్కొన్నాడు.