
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ వేదికలు, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే స్పష్టం చేశాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. సిడ్నీలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మూడో టెస్టు వేదికలో మార్పులు చేయాలని సీఏ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
జనవరి 7న సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుండగా.. గతవారం అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనవరి 15న బ్రిస్బేన్‌లో జరగాల్సిన నాలుగో టెస్టును సిడ్నీకి మార్చి.. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టును బ్రిస్బేన్‌లో నిర్వహిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై సీఏ స్పందించింది. జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి మొదలవనుంది.
'షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో మ్యాచ్ నిర్వహణకే మా తొలి ప్రాధాన్యత. క్రికెట్ సమర్థ నిర్వహణకు సీఏ పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. బయో భద్రత బృందం, ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలు, ఆసీస్ క్రికెటర్లతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం' అని సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే ఓ అధికారిక ప్రకటనలో చెప్పాడు. ఈనెల 26న మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు మొదలవుతుంది. కరోనా తీవ్రత మరింత పెరిగితే మెల్‌బోర్న్‌లోనే మూడు, నాలుగో టెస్టులు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.
మరోవైపు గాయాల నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ సీన్ అబాట్ శనివారం సిడ్నీ నుంచి మెల్‌బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా యువ ఆటగాడు విల్ పకోస్కి అంతర్జాతీయ అరంగేట్రం అలస్యమవుతూనే ఉంది. కంకషన్ నుంచి కోలుకోకపోవడంతో శనివారం ఆరంభమయ్యే బాక్సిండ్ డే టెస్టుకూ అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతి మోచేతికి తాకడంతో గాయపడినట్లు కనిపించిన ఓపెనర్ రోరీ బర్న్స్‌కు ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. అతడు రెండో టెస్టులో ఆడనున్నాడు.