మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ఫైనల్‌లో ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తను ఎదుర్కొన్న ప్రతి బంతినీ బౌండరీ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడీ విండీస్ విధ్వంసకారుడు. ఈ క్రమంలోనే కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అక్కడితో ఆగకుండా కేవలం 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టు ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. అసలు అతనే ఈ టీంను ఒంటి చేత్తో గెలిపించాడని అనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ మాత్రం.. అతని టీ20 కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీన్ని అతని టీ20 గణాంకాల్లో చేర్చడం కుదరదట.

ఎందుకంటే.. ప్రస్తుతం పూరన్ ఆడిన ఎంఎల్‌సీ లీగ్‌కు అధికారికంగా టీ20 స్టేటస్ లేదట. ఈ కారణంగా ఈ లీగ్‌లో పూరన్ విధ్వంసాన్ని అతని కెరీర్‌లో చెప్పుకోవడం కుదరదు. ఈ టోర్నీ జరిగింది కూడా అమెరికాలో. ఈ దేశం క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో ఒకటి కాదు. ఐసీసీలో కేవలం ఒక అసోసియేట్ మెంబర్ మాత్రమే. ఈ కారణంగానే ఈ లీగ్‌కు అధికారికంగా టీ20 స్టేటస్‌ను ఐసీసీ ఇవ్వలేదు.
అయితే ఐసీసీ నుంచి ఎంఎల్‌సీ నిర్వహణకు అనుమతి లభించింది. కానీ మిగతా పాపులర్ లీగ్స్ అయిన అబుధాబి టీ10 లీగ్, యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్, గ్లోబల్ టీ20 కెనడా, ఐఎల్‌టీ20 తదితర పాపులర్ లీగ్స్‌లాగే.. ఎంఎల్‌సీకి టీ20 స్టేటస్ లభించలేదు. కేవలం ఈ స్టేటస్ లేని కారణంగా పూరన్ విధ్వంసానికి గుర్తింపు దక్కదని అనుకుంటే పొరపాటే. ఐసీసీ కన్నా ముఖ్యంగా ఫ్యాన్స్ అతని బ్యాటింగ్ సత్తాను గుర్తించారు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా తమ జట్లను ఆడిస్తున్న ఫ్రాంచైజీలు కూడా పూరన్ పవర్ గుర్తించాయి. తన సూపర్ ఇన్నింగ్స్‌లో పూరన్ ఏకంగా పది ఫోర్లు, పదమూడు సిక్సర్లు బాదడం గమనార్హం. రెగ్యులర్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఈ మ్యాచ్ ఆడకపోవడంతో.. ఎంఐ న్యూయార్క్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన పూరన్ అదరగొట్టాడు. తన టీంకు ఎంఎల్‌సీ ట్రోఫీ అందించాడు.