నికొలస్ పూరన్: కరోనా విలయాన్ని చూసి..చలించి: ఐపీఎల్ శాలరీ మొత్తం విరాళం

అహ్మదాబాద్: భారత్‌లో కరోనా వైరస్ విలయాన్ని సృష్టిస్తోంది. పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మరణాలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. రోజూ మూడువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3,498 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు.

దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసులు 32 లక్షలకు చేరువ అయ్యాయి. వాటి సంఖ్య 31,70,228కి చేరింది. ఒకేసారి ఇన్ని లక్షలమందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్‌లో లేవనేది స్పష్టమౌతోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ తుదిశ్వాసను విడుస్తున్నారు. కరోనా వల్ల కన్నుమూసిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానిక్కూడా చోటు దొరకని దుస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దీన్ని చూసి చలించిన పలు దేశాలు భారత్‌కు సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అనేక దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలను అందజేస్తున్నాయి. ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చిన కొందరు విదేశీ క్రికెటర్లు సైతం.. ఈ పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాట్ కమ్మిన్స్ 50 వేల డాలర్లను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. అతన్ని చూసి స్ఫూర్తి పొందిన ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం ఒక బిట్ కాయిన్ విలువ మొత్తాన్ని సహాయంగా అందజేశాడు.

తాజాగా- ఇదే జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ నికొలస్ పూరన్ చేరాడు. కరోనా వైరస్ వల్ల భారత్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని చెప్పాడు. దీన్ని అధిగమించడానికి తనవంతు సహాయాన్ని అందిస్తున్నాని తెలిపాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ శరవేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు. దీనికోసం తన ఐపీఎల్ శాలరీ మొత్తాన్నీ విరాళంగా ప్రకటిస్తున్నట్లు నికొలస్ పూరన్ తెలిపాడు. భారత్ త్వరగా కోలుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 30, 2021, 13:15 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X