స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో కైల్ జేమిసన్ నాలుగు వికెట్లు, మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
అయిదు పరుగులకే సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. రెనార్డ్ వాన్ థండర్ (31; 83 బంతుల్లో), హంజా (36; 92 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు చేజార్చుకున్నారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ బెడింగ్‌హమ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. పీటర్సన్ (16; 63 బంతుల్లో)తో కలిసి అయిదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అనంతరం కివీస్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. రువాన్ డి స్వర్డ్ట్ (34*; 56 బంతుల్లో) నిలిచినప్పటికీ సౌతాఫ్రికాను ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. అనుభవం లేని సౌతాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆటలో 80 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడం గొప్ప విషయమే. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన రచిన్ రవీంద్ర (240; 366 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 511 ఆలౌట్ (రచిన్ (240), విలియమ్సన్ (118); నీల్ బ్రాండ్ 6/119)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్ (పీటర్సన్ (45), బెడింగ్‌హమ్ (32); మ్యాట్ హెన్రీ 3/31)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 179/4 డిక్లేర్ (విలియమ్సన్ (109*), కాన్వే (29); నీల్ బ్రాండ్ 2/52)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 247 ఆలౌట్ (బెడింగ్‌హమ్ (87), హంజా 36; జేమిసన్ 4/58)