స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-1తో సమం చేసింది. తొలి టీ20లో బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించగా, రెండో మ్యాచ్ వర్షం కారణంగా రర్దైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన ఆఖరి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఇవాళ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. కానీ నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం రాకుంటే సిరీస్ బంగ్లాదేశ్‌కు దక్కేది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా కెప్టెన్ శాంటో (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు తీసింది. కెప్టెన్ శాంట్నర్ బంతిని గింగరాలు తిప్పుతూ నాలుగు వికెట్లు సాధించాడు. నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు. సౌథి, మిల్నే, సీర్స్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ను బంగ్లాదేశ్ భయపెట్టింది. 49 పరుగులకే సగం వికెట్లు తీసింది. బంగ్లా బౌలర్ల ధాటికి సీఫెర్ట్ (1), డారిల్ మిచెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (1), చాప్‌మన్ (1) సింగిల్ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఓపెనర్ ఫిన్ అలెన్ (38) దూకుడుగా ఆడటంతో కివీస్ రన్‌రేటును నియంత్రణలో ఉంచుకుంది. అలెన్ ఔటైన తర్వాత నీషమ్ (28*), శాంట్నర్ (18*) జాగ్రత్తగా ఆడారు.
అయితే 14.4 ఓవర్లకు న్యూజిలాండ్ 95/5తో ఉన్నప్పుడు వర్షం రాకతో ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి కివీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 17 పరుగుల ముందజలో ఉంది. తర్వాత మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు ఫలితాన్ని తేల్చడంతో కివీస్ గెలిచింది. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో బంగ్లాదేశ్ రెండు సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ గడ్డపై తొలి వన్డే, తొలి టీ20 గెలుపును బంగ్లా రుచి చూసింది.