దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ తొలిసారిగా టెస్టు సిరీస్ విజయం సాధించింది. సఫారీలపై గత 92 ఏళ్లుగా 18 సార్లు టెస్టు సిరీస్ గెలుపు కోసం ప్రయత్నించిన కివీస్ ఎట్టకేలకు విజయకేతనం ఎగురవేసింది. హమిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏడు వికెట్లు తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఈ ఘనత సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పర్యటనకు పంపడం గమనార్హం.
అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)తో ఒప్పందాలు చేసుకోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యువ ప్లేయర్లును కివీస్ పర్యటనకు పంపింది. ఏకంగా ఏడుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. కెప్టెన్‌గా నియమించిన నీల్ బ్రాండ్‌తో సహా. అయితే తొలి టెస్టులో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రియా యువ జట్టు.. రెండు టెస్టులో ప్రతిఘటించింది. అంత సునాయాసంగా ఓటమిని ఒప్పుకోలేదు.

రెండో టెస్టు తొలి మూడు రోజుల్లో దక్షిణాఫ్రికా గట్టిపోటీనిచ్చింది. కానీ ఇవాళ ఆటలో కేన్ విలియమ్సన్ (133*; 260 బంతుల్లో) మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చాడు. అతడు అజేయ సెంచరీతో కదం తొక్కడంతో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. ఈ క్రమంలో విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు.
టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 172 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 174 ఇన్నింగ్స్‌ల్లో 32 సెంచరీలు సాధించాడు. అంతేగాక టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ పాక్ బ్యాటర్ యునిస్ ఖాన్ (5)తో సంయుక్తంగా రికార్డు సృష్టించాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 242 పరుగులు (రౌన్ డి స్వార్ట్ 64, విలియమ్ ఒరుర్కే 4/59)
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 211 పరుగులు (విలియమ్సన్ 43, డేన్ పీడ్ట్ 5/89)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 235 పరుగులు (బెడింగ్‌హమ్ 110, విలియమ్ ఒరుర్కే 5/34)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 269/3 (విలియమ్సన్ 133*, డేన్ పీడ్ట్ 3/93)