హైదరాబాద్: న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ల్యూక్ రోంచీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల రోంచీ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.
రిటైర్మెంట్ అనంతరం రోంచీ మాట్లాడుతూ న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆడటంతో తన కల నెరవేరినట్లు పేర్కొన్నాడు. జట్టు తరుపున ఒకే సమయంలో మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహించడం మధురమైన జ్ఞాపకంగా రోంచీ అభివర్ణించాడు.

'ఇన్నేళ్ల నా క్రికెట్ కెరీర్ సాఫీగా సాగడంలో నా భార్య షాన్, కుమారులు బ్రాడీ, ఇండీలు మద్దతుగా నిలిచారు. క్రికెట్ అనేది నన్ను ఇంటి నుంచి ఎంతో దూరం తీసుకెళ్లింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నన్ను అర్ధం చేసుకున్నారు' అని రోంచీ పేర్కొన్నాడు.
2008లో వన్డే క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన రోంచీ న్యూజిలాండ్ తరుపున 85 మ్యాచ్‌లు ఆడి 1397 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 170 నాటౌట్. చివరిసారిగా న్యూజిలాండ్ తరుపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోంచీ 43 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. 2008, 2009 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరుపున నాలుగు వన్డేలు, టీ20లు ఆడిన రోంచీ 2013లో న్యూజిలాండ్‌కు షిప్ట్ అయ్యాడు.
2015 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 32 అంతర్జాతీయ టీ20లు ఆడిన రోంచీ ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. టీ20ల్లో రోంచీ అత్యధిక స్కోరు 51 నాటౌట్. 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోంచీ నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు.
8 ఇన్నింగ్స్ ల్లో 319 పరుగులు చేశాడు. టెస్టుల్లో రోంచీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 88 పరుగులుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ వెల్లింగ్టన్, దేశీయ టీ20 టోర్నీల్లో పాల్గొంటానని స్పష్టం చేశాడు. రోంచీ వీడ్కోలుపై కివీస్ మాజీలు ట్విట్టర్‌లో స్పందించారు.
రిటైర్మెంట్ ప్రకటించిన పటేల్
2005లో న్యూజిలాండ్ జట్టులో స్థానం దక్కించుకున్న పటేల్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్ తరఫున పటేల్ 24 టెస్టులు, 43వన్డేలు, 11 టీ20లు ఆడాడు.