
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 93 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. గప్తిల్ (93: 56 బంతుల్లో 4x6, 6X7) చెలరేగడంతో న్యూజిల్యాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. డారియల్ మిచెల్ (13), కేన్ విలియమ్సన్ (0), డెవాన్ కాన్‌వే (1)లు విఫలమయినా.. గ్లెన్ ఫిలిప్స్ (33) సత్తాచాటాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 2, సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా, మార్క్ వ్యాట్ ఒక వికెట్ తీశాడు. సెమిస్ రేసులో నిలవాలంటే ఈ విజయం కివీస్ జట్టుకు ఎంతో ముఖ్యం.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. సఫ్యాన్ షరీఫ్ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్ డెరిల్ మిచెల్ (13) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0) కీపర్‌కి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కివీస్ 35 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డెవాన్ కాన్వే (1) కూడా విఫలమయ్యాడు. జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద కాన్వే ఔట్ అయ్యాడు.
అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడిన మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి కివీస్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే క్రిస్ గ్రీవ్స్ వేసిన 13వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గప్తిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కాస్త నెమ్మదిగా ఆడిన గప్తిల్.. హాఫ్ సెంచరీ అనంతరం గేర్ మార్చాడు. ఆచితూచిఆడుతున్న ఫిలిప్స్.. వేగం పెంచే క్రమంలో బ్రాడ్లే వీల్ వేసిన 18.2 బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే శతకం దిశగా సాగుతున్న గప్తిల్ కూడా ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన జేమ్స్ నీషమ్ (10), మిచెల్ సాంట్నర్ (2) నాటౌట్‌గా నిలిచారు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లే వీల్ రెండేసి, మార్క్ వాట్ ఒక వికెట్ తీశారు.