NZ Playing 11 vs ENG: బౌలింగే ఆయుధం.. ఫామ్‌లో గప్టిల్! ఇంగ్లండ్‌తో బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టు ఇదే!!

హైదరాబాద్: బ్యాటింగ్ మెరుపులు, అదరగొట్టే బౌలింగ్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలతో అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ 2021లో ఇక అసలు సిసలు సమరానికి వేళైంది. ఈరోజు (నవంబర్ 10) నాకౌట్ పోరాటాలకు తెరలేవనుంది. బుధవారం తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడుతుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దూకుడుకు ప్రశాంతతకు మధ్య జరిగే పోరు అనే చెప్పొచ్చు.
2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో కివీస్ ఓడిపోయింది. అందుకు బదులు తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని కేన్ సేన భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టుపై విజయమే లక్ష్యంగా న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.

హెడ్ టు హెడ్ రికార్డ్స్
టీ20 ప్రపంచకప్ 2021లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ గ్రూప్- 2లో అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి.. ఒక దాంట్లో ఓడి రెండో స్థానంతో సెమీస్ చేరింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, న్యూజిలాండ్ 2 మ్యాచులు గెలిచాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు.
ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. అబుదాబి పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగానే ఉంటుంది. దాంతో ఈరోజు బ్యాట్‌కు బంతికి మధ్య మంచి పోరుగా మారే అవకాశముంది. రాత్రి పూట మ్యాచ్‌లో మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం కలుగుతోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.

ఫామ్‌లో గప్టిల్
కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశాంత న్యూజిలాండ్‌కు కలిసిరానుంది. ఆటగాళ్ల దూకుడుకు తన ప్రశాంతతను జోడించిన విలియమ్సన్ ఈ మెగా టోర్నీలో మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే పాక్ చేతిలో కివీస్ ఓడినప్పటికీ.. ఆ తర్వాత భారత్‌పై గెలుపుతో సహా నాలుగు విజయాలు అందుకుంది.
తీవ్ర ఒత్తిడిలోనూ కివీస్ గొప్పగా ఆడుతోంది. ఏ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా సమష్టిగా సత్తాచాటుతుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, దేవాన్ కాన్వే, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తున్నా.. కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం లేదు. ఒకరిద్దరు తప్ప మిగతావారందరూ పెద్దగా పరుగులు చేయడం లేదు. విలియమ్సన్ ఇంకా వేగాన్ని అందుకోవాల్సి ఉంది. ఈ టోర్నీలో కివీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్తిల్ అదే ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లండ్ జట్టుకు తిప్పలు తప్పవు.

బౌలింగే ఆయుధం
మెగా టోర్నీలో దుర్భేద్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని న్యూజిలాండ్ గొప్పగా కట్టడి చేస్తోంది. సీనియర్ పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీతో పాటు ఆడమ్ మిల్నె, ఇష్ సోధి, మిచెల్ శాంట్నర్ పూర్తిస్థాయిలో రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లకు తమ పేసర్లతో చెక్ పెట్టేందుకు కివీస్ సిద్ధమైంది.
దుబాయ్, షార్జాలతో పోలిస్తే అబుదాబిలో పవర్‌ప్లేలో సీమర్ల సగటు (17.38) గొప్పగా ఉంది. ఇదే ఇప్పుడు కేన్ సేనకు కలిసిరానుంది. బౌల్ట్, సౌథీ, మిల్నె మంచి సీమ్, స్వింగ్, బౌన్స్ రాబడితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టాలంటే న్యూజిలాండ్ శక్తికి మించి శ్రమించక తప్పదు.

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), దేవాన్ కాన్వే, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, ఆడమ్ మిల్నె.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications