
సౌథాంప్టన్: బుధవారం ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఎన్నో ఏళ్లుగా వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ అందుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న కివీస్.. చివరకు టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్కసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది. దీంతో పట్టరాని సంతోషంలో ఉన్నారు కివీస్ ప్లేయర్స్, అభిమానులు.
న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (47 నాటౌట్: 100 బంతుల్లో 6x4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52 నాటౌట్: 89 బంతుల్లో 8x4) బాధ్యతగా ఆడి జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. టేలర్ విన్నింగ్ షాట్ కొట్టగానే న్యూజిలాండ్ డ్రస్సింగ్ రూమ్‌లో అసలైన సందడి మొదలైంది. ఆటగాళ్లు ఒకర్నొకరు హత్తుకొంటూ.. గెంతులు వేస్తూ.. పెద్దగా కేకలు వేస్తూ తమ ఆనందం పంచుకున్నారు. ఇందుకుసంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌ను క్రికెట్ మాజీలు, ఫాన్స్ అభినందిస్తున్నారు. ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వరణుడు కీలక పాత్ర పోషించాడు. రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మరో రెండు రోజులు పూర్తి ఆట సాధ్యపడలేదు. దాంతో రిజర్వు డే అయిన బుధవారం ఫలితం తేలుతుందో లేదోనని భావించారు. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడంతో స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగా అందుకుంది. కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 249 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. 140 పరుగులు లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన కివీస్‌కి ఛాంపియన్‌షిప్ గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన భారత్ జట్టుకి రూ.5.84 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. మూడో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకి రూ.3.29 కోట్ల ప్రైజ్‌మనీ, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కి రూ.2.56 కోట్లు, ఐదో స్థానంలోని దక్షిణాఫ్రికాకి 1.46 కోట్లు దక్కాయి. ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచిన పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకి రూ.73 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.