
లండన్: ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఆట చివరి రోజు అయిన ఆదివారం కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 చేసింది. ఈ సమయంలో మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించడంతో.. అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇదే సమయంలో కివీస్ సారథి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ ముందు 273 పరుగుల లక్ష్యంను కేన్ సేన ఉంచింది. ఇంకా రెండు సెషన్ల ఆట ఉన్న నేపథ్యంలో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఓవర్ నైట్ స్కోరు 62/2తో ఐదవ రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్.. ఆదిలోనే నీల్ వాగ్నర్ (10) వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో 9 పరుగులు జోడించి ఓలీ రాబిన్సన్ చేతికి చిక్కాడు. ఆపై టామ్ లాథమ్ (36), రాస్ టేలర్ (33) మరో వికెట్ పడకుండా ఆడారు. లాథమ్ మరీ నెమ్మదిగా ఆడుతూ పెవిలియన్ చేరాడు. ఆపై టేలర్, నికోల్స్ (23) మోస్తరు స్కోరుకే పరిమితమయ్యారు. వాల్టింగ్ (15), గ్రాండ్‌హోమ్ (9) నిలకడగా ఆడుతుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంచ్ బ్రేక్ అనంతరం విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
రెండో సెషన్లో 273 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఓపెనర్‌లు రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. స్ట్రైక్ కూడా రొటేట్ చేయకుండా.. డ్రానే లక్ష్యంగా ఆడుతున్నారు. ఈ జోడీని విడదీసేందుకు కివీస్ పేసర్లు ప్రయత్నిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 20 రన్స్ చేసింది. బర్న్స్ 38 బంతుల్లో 11, సిబ్లీ 34 బంతుల్లో 5 రన్స్ చేశారు. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 253 పరుగులు అవసరం. ఇంకా దాదాపు 63 ఓవర్ల ఆట మిగిలివుంది. వన్డే తరహా ఆడితే లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దెబ్బ తీశాడు. నిప్పులుచెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను వరుసగా పెవిలియన్ చేర్చాడు. సౌథీతో పాటు మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) కూడా విజృంభించడంతో ఇంగ్లండ్ ఒక దశలో 140/6తో ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్ జో రూట్ (42), రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) పట్టుదలగా పోరాడాడు. సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు (275) అందించాడు. డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది.