హైదరాబాద్: అక్టోబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ఆతిథ్య టీమిండియాతో 3 వన్డేలు, 2 టీ20లు ఆడనుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధుల బృందం సోమవారం రాజ్‌కోట్ మైదానాన్ని పరిశీంచి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.
న్యూజిలాండ్ జట్టు మేనేజర్ మైక్ సాండిల్, జట్టు భద్రతాధికారి గ్యారీ కూపర్, హెన్రీ మూరే ఎస్‌సీఏ(సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్)లతో పాటు బీసీసీఐ అధికారి మయాంక్ పరీక్‌లు రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని సందర్శించినట్లు ఎస్‌సీఏ మీడియా మేనేజర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లకు అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలు, పిచ్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌సీఏ కల్పిస్తోన్న సౌకర్యాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు చెప్పారు. అక్టోబరు 22 నుంచి నవంబరు 7 వరకు జరిగే ఈ పర్యటనలో పుణె, ముంబై, కాన్పూర్ వేదికలు వన్డేలకు ఆతిథ్యం ఇస్తుండగా... ఢిల్లీ, కటక్, రాజ్‌కోట్ వేదికల్లో టీ20లు జరగనున్నాయి.