
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో వన్డేలో ఘన విజయాన్ని అందుకుంది. డక్ వర్త్ లూయిస్ విధానంలో కరేబియన్ వీరులను ఏకంగా 50 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. తొలి వన్డేలో విజయం సాధించిన దూకుడును వెస్టిండీస్ ఇందులో ప్రదర్శించలేక చేతులెత్తేసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు వన్డేల ఈ సిరీస్‌ను 1-1తో లెక్క లెవెల్ చేసింది. చివరిదైన మూడో మ్యాచ్ ఆదివారం జరుగనుంది.
ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ ఏమీ సాధించలేకపోయింది. 48.2 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది కివీస్. జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్‌ను అందుకున్నారు. ఓపెనర్ ఫిన్ అల్లెన్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 117 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 96 పరుగులు చేసి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిఛెల్ 41, లోయర్ ఆర్డర్‌లో మిఛెల్ శాట్నర్ 26 పరుగులు చేశారు.
మిగిలిన బ్యాటర్లెవరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. కెవిన్ సింక్లయిర్ 8.2 ఓవర్లల్లో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ మూడు వికెట్లు కూల్చాడు. అకిల్ హొస్సైన్-2, అల్జారి జోసెఫ్ ఒక వికెట్ తీసుకున్నారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆరంభం నుంచీ వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒక దశలో 72 పరుగులకే ఎనిమిది వికెట్లను నష్టపోయింది. 100 పరుగులు కూడా చేయలేదనిపించింది.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు యాన్నిక్ కరియా, అల్జారి జోసెఫ్ తెగించి ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లకు కొరుకుడు పడలేదు. ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 85 పరుగులు జోడించారు. దీనితో జట్టు స్కోర్ 161 పరుగుల వరకూ వెళ్ల గలిగింది. కరియా 84 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. అల్జారీ జోసెఫ్ మాత్రం టీ20 ఫార్మట్‌లో రెచ్చిపోయాడు. భారీ షాట్లు ఆడాడు. 31 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఇదే స్టేడియంలో ఆదివారం షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది సిరీస్ డిసైడర్. గెలిచిన వారిదే సిరీస్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు లేకపోలేదు. రెండు జట్లకూ సిరీస్ గెలవడం అత్యవసరం.