శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలకంపై న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. బే ఓవల్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 42 పరుగులు చేశాడు.
ఓపెనర్ రాబిన్ సన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేశాడు. చివరల్లో వికెట్ కీపర్ మిచెల్ హో ధాటిగా ఆడాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు 2 సిక్స్ లో కొట్టాడు. ఫిలిప్స్ 23 పరుగులు చేయగా.. మిచెల్ 18 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. తుషర, పతిరన ఒక్కో వికెట్ తీశారు. 187 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది.

మొదటగా లంక బ్యాటర్లు ధాటిగా ఆడారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలయ్యారు. కుశాల్ పెరారే 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 48 పరుగులు చేశాడు. నిస్సాంక 28 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్ లతో 37 పరుగులు చేశాడు. అసలంక 27 పరుగులు చేయగా.. మిగతా వారంతా తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో జాకాబ్ డుప్పీ 4 వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
బ్రాస్ వెల్, ఫ్లాక్స్ ఒక్కో వికెట్ తీశారు. మూడో టీ20 జనవరి 2న జరగనుంది. మొదటి టీ20లో కూడా శ్రీలంక ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 62, బ్రాస్ వెల్ 59 పరుగులు చేశారు. శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. నిస్సాంక 90 పరుగులు చేశాడు. అయినా జట్టును గెలిపించలేకపోయాడు.