ఫిట్‌నెస్ అంటే మనలో చాలామందికి జిమ్‌కి వెళ్లి కొంచెం వెయిట్స్ ఎత్తడం లేదా రన్నింగ్ చేయడం గుర్తుకువస్తుంది. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఫిట్‌నెస్ అంటే ఏమిటో కొత్త అర్థం చెప్పాడు! సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసినవారందరూ ఒక్కసారిగా అంటున్నారు - "వాట్ ఏ స్ట్రెంత్ మ్యాన్!". న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ తన శారీరక సామర్థ్యాన్నిపరాకాష్టకు చేర్చినట్లు కనిపించే ఓ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది కేవలం పుషప్ కాదు, ఫిట్‌నెస్ ప్రపంచానికి ఆయన విసిరిన ఒక సవాల్.
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్‌గా ఉండే.. ఎప్పుడూ శక్తితో ఉల్లాసంగా ఉండే ఆటగాళ్లలో గ్లెన్ ఫిలిప్స్ అగ్రస్థానంలో ఉంటాడు. కేవలం తన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో, మెరుపు ఫీల్డింగ్‌తోనే కాకుండా, మైదానం వెలుపల తన కఠినమైన వర్కవుట్లతో కూడా ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

'మిషన్ ఇంపాజిబుల్' పుషప్
తాజాగా గ్లెన్ ఫిలిప్స్ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఈ వర్కవుట్ ఫోటో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. గ్లెన్ ఫిలిప్స్ తన రెండు చేతులను నేలపై కాకుండా, రెండు భారీ డంబెల్స్‌పై ఉంచి ప్లాంక్ పుషప్ భంగిమలో సంపూర్ణ బ్యాలెన్స్ చేస్తున్నాడు. డంబెల్స్‌పై బ్యాలెన్స్ చేయడం వల్ల అతని భుజాలు, కోర్ కండరాలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీనికి తోడు ఒక మహిళ అతని వీపుపై పూర్తిగా పడుకుని ఉన్నాు. ఆమె బరువును సునాయాసంగా మోస్తూ ఫిలిప్స్ ఈ క్లిష్టమైన పుషప్‌ను పూర్తి చేస్తున్న దృశ్యం చూస్తుంటే, అతని కోర్ స్ట్రెంత్, భుజాల స్థిరత్వం, మొత్తం శారీరక బలం ఎంత అద్భుతంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని షేర్ చేసిన క్రికెట్ పేజీలు, అభిమానులు "What A Strength Man" (ఎంతటి బలవంతుడు), "క్రికెటర్లకు ఫిట్‌నెస్ లక్ష్యం" అంటూ ఫిలిప్స్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఫిట్‌నెస్ రహస్యం
మైదానంలో గ్లెన్ ఫిలిప్స్ చూపించే అసాధారణమైన చురుకుదనం, అతని వేగవంతమైన పరుగు, కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌లు అతని కఠోరమైన శిక్షణకు నిదర్శనం. ఆయన కేవలం బలాన్ని పెంచే వర్కవుట్లే కాకుండా, కండరాల సమతుల్యత, స్థిరత్వం పెంచే ఇటువంటి ఫంక్షనల్ ట్రైనింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ వైరల్ వర్కవుట్ ఫోటో... నేటి తరం క్రికెటర్లు తమ ఆట నైపుణ్యాలతో పాటు, ఫిట్‌నెస్‌ను కూడా ఎంత ఉన్నత స్థాయిలో నిర్వహిస్తున్నారో తెలియజేసే ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ కష్టమైన ఫీట్ ద్వారా ఫిలిప్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు మరియు ఫిట్‌నెస్ ఔత్సాహికులకు 'శారీరక బలం' విషయంలో ఒక సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విప్లవం... కానీ అంతకంటే ముందే!
విరాట్ కోహ్లీ టీమిండియాలోకి 'ఫిట్‌నెస్ విప్లవాన్ని' తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఫిట్‌నెస్ ప్రాధాన్యతను గ్రహించి తనను తాను మార్చుకున్నాడు. కఠినమైన ఆహార నియమాలు (డైట్), క్రమం తప్పని వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. అందుకే ఆయనకు 'ఫిట్టెస్ట్ క్రికెటర్గా గుర్తింపు లభించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ కంటే కూడా అత్యంత అసాధారణమైన ఫిట్‌నెస్ స్థాయిలు ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను 'ఫిట్‌నెస్ కా బాప్' అని పిలవడంలో అతిశయోక్తి లేదని ఫిట్‌నెస్ ఫ్యాన్స్ అంటున్నారు.
మైదానంలో విన్యాసాలే నిదర్శనం
గ్లెన్ ఫిలిప్స్ మైదానంలో చేసే ఫీల్డింగ్ విన్యాసాలు, అతని ఫిట్‌నెస్‌కు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన పక్షిలా గాల్లోకి ఎగురుతూ అలవోకగా కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టగలడు. బౌండరీ లైన్ వద్ద అతని చురుకుదనం అద్భుతం. జట్టు కోసం వికెట్ కీపింగ్ చేయడంతో పాటు, అవసరమైతే బౌలింగ్ చేయగలడు. అంతేకాకుండా, విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగల సత్తా ఆయన సొంతం. న్యూజిలాండ్‌కు సవ్యసాచిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.
రోజుకి 800 పుషప్స్: ఫిలిప్స్ రహస్యం
తన అద్భుతమైన ఫిట్‌నెస్, మైదానంలో పవర్ హిట్టింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని గ్లెన్ ఫిలిప్స్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అది అక్షరాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. "రోజుకు 800 పుషప్స్ చేయడమే నా ఫిట్‌నెస్ సీక్రెట్," అని ఈ కివీస్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. ఫిలిప్స్ తన పుషప్స్ వర్కవుట్ ప్లాన్‌ను వివరించారు: : ఒకానొక సందర్భంలో, తాను ఒకే రోజులో 800 పుషప్స్ వరకు చేసేవాడినని తెలిపారు. వీటిని సెట్‌ల వారీగా 300, 300, 200 చొప్పున పూర్తి చేసేవాడినని చెప్పారు. ఇతర జిమ్ వర్కవుట్స్‌ను బట్టి, కనీసం 300, 200 పుషప్స్ సెట్‌లతో 500 పుషప్స్ పూర్తి చేసేవాడినని పేర్కొన్నారు. కార్డియో, స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజ్‌ల ఆధారంగా తన పుషప్స్ ప్లాన్ ఉండేదని, అయితే తాను ఎక్కువగా బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్‌లకే ప్రాధాన్యత ఇచ్చేవాడినని స్పష్టం చేశారు.
"జిమ్‌లో కష్టపడటంతోనే అలవోకగా సిక్స్‌లు కొట్టగలుగుతున్నాను. బరువు పెరిగానని గ్రహించిన వెంటనే బరువులు ఎత్తడం మొదలుపెట్టాను. హార్డ్ వర్కౌట్స్ కారణంగా నా ఆటను సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ముఖ్యంగా నా బలం ఏమిటో తెలుసుకోవడం, భారీ షాట్స్ ఆడేందుకు కావాల్సిన లైన్ అండ్ లెంగ్త్ ఏమిటో గ్రహించడం వంటి విషయాలు బాగా అర్థమయ్యాయి." అని ఫిలిప్స్ పేర్కొన్నారు. సాధారణంగా సగటు మనిషి 30 పుషప్స్ చేయడమే చాలా కష్టం. అలాంటిది రోజుకు 800 పుషప్స్... అదీ ఒకే సెట్‌లో 300 పుషప్స్ అంటే మాటలా? అందుకే ఫిట్‌నెస్ ప్రపంచంలో గ్లెన్ ఫిలిప్స్ పేరు ఇప్పుడు 'ఫిట్‌నెస్ కా బాప్'గా మారుమోగుతోంది.