హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో కొత్త టీ20లీగ్‌ను నిర్వహించడానికి ఆ దేశ బోర్డు ముందుకు రావడాన్ని కెప్టెన్ ఏబీ డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. 2017-18 సమ్మర్ సీజన్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త టీ20 లీగ్ నిర్వహించాలని ముందుకొచ్చిన సంగతి తెలిసందే. దీనిపై డివిలియర్స్ మాట్లాడుతూ ఈ టీ20 లీగ్ ఎంతోమంది యువకులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నాడు.
అంతేకాదు సాధ్యమైనంత ఎక్కువ మంది క్రికెటర్లకు దేశం తరపున ఆడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. 'లీగ్ పట్ల నేనంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నా. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయి. కొత్త ట్వంటీ20 లీగ్ యువకులకు ప్రేరణగా నిలుస్తుంది. మా దేశంలో క్రికెట్ ఆటపై మరింత మొగ్గు చూపడానికి కొత్త లీగ్ దోహదం చేస్తుంది. ఈ లీగ్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది' అని డివిలియర్స్ అన్నాడు.

'మా దేశంలో కూడా ట్వంటీ 20 లీగ్ నిర్వహించాలనే ఆలోచన చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు హ్యాట్సాఫ్. ఇది మా క్రికెట్‌కు సరికొత్త ఊపిరి పోసింది. ఈ దేశవాళీ టోర్నమెంట్ అద్బుతాలు సృష్టింస్తుందని భావిస్తున్నా. ఐపీఎల్ తరహాలో మా క్రికెట్ లీగ్ విజయవంతమవడం ఖాయం' అని ఏబీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) మాదిరిగానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా సమ్మర్ సీజన్‌లో కొత్త ట్వంటీ 20 లీగ్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 లీగ్‌ని 2017 చివరి క్వార్టర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
ఐపీఎల్, బీబీఎల్ మాదిరిగానే ఆసక్తి ఉన్న విదేశీ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొనవచ్చు. ఈ ట్వంటీ 20 లీగ్‌లో మొత్తం ఎనిమిది ట్వంటీ 20 జట్లు పోటీ పడనున్నాయి. ఈ టీ20 లీగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.